CM Chandrababu on Tirupati Stampede Incident:తిరుమలలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరించారని ఈ క్రమంలో వీరిని సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
ఆర్థికసాయం ప్రకటించిన సీఎం:తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున టీటీడీ ద్వారా ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. ఆరుగురు మృతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా ఇస్తామని తెలిపారు. తీవ్రంగా గాయాలైన ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ఇంక వారి ఆరోగ్యం మెరుగయ్యే వరకు వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపారు. గాయాలైన మిగతా 33 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని అన్నారు. ఆలానే గాయపడిన 35 మందికి శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గాయపడినవారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం. వైకుంఠ దర్శనాన్ని 10 రోజులకు పెంచారు అలా ఎందుకు పెంచారో తెలియదు. తిరుమలలో మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిది కాదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి. ఏ ఆలయంలోనూ ఇలాంటి అపచారాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.- సీఎం చంద్రబాబు
తిరుమలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నా:తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డానని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానని అన్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన తరువాత ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. ఈ దివ్యక్షేత్రం పవిత్రత కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని అలానే తిరుమల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని కొన్ని సూచనలు కూడా చేశానని తెలిపారు. ఈ సూచనలను బోర్డులో చర్చించి అమలు చేస్తారని వెల్లడించారు. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తే అది మంచిది కాదని అన్నారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలులేదని స్పష్టం చేశారు.