CM Chandrababu Orders to Stop GPS Gazette: ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ ఉత్తర్వులు తక్షణం నిలిపి వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్థిక శాఖ సమీక్షలో దీనిపై సీఎం చంద్రబాబు అరా తీశారు. ఇపుడు ఏపీ జీపీఎస్‌పై గెజిట్ ఎలా విడుదల అయ్యిందని చంద్రబాబు ఆరా తీశారు. గత ప్రభుత్వ ప్రతిపాదనలతో ప్రస్తుతం ఉత్తర్వులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా గెజిట్ ఎలా విడుదల చేశారన్న అంశంపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే ఆ ఉత్తర్వులు నిలిపివేయాలన్నారు.
Gazette Notification Controversial on GPS: కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం) స్థానంలో జీపీఎస్‌ను (గ్యారంటీట్ పెన్షన్ స్కీమ్) అమలులోకి తెస్తూ తీసుకున్న నిర్ణయంపై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ సంతకం చేశారు. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ దస్త్రాలన్నింటిపైనా సంతకాలు చేశారు. వాటిలో జీపీఎస్ దస్త్రం సైతం ఉంది. జూన్ 12వ తేదీన జీవో 54ను విడుదల చేయగా, పాత ప్రభుత్వంలోనే రూపొందించిన నోటిఫికేషన్‌ను కొద్ది రోజుల క్రితం గెజిట్‌లో అప్‌లోడ్ చేశారు. జీపీఎస్ 2023 అక్టోబరు 20 నుంచి అమల్లోకి వస్తుందని దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి, గతేడాది అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేశారు. జీపీఎస్ అమలుకు, నాడు విధివిధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటని మండిపడ్డారు.