CM CHANDRABABU ON WHATSAPP GOVERNANCE:కలెక్టరేట్‌లలో వాట్సప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాట్సప్ గవర్నెర్న్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. త్వరలోనే వాట్సప్ ద్వారా 500 వరకూ పౌరసేవలను అందించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంతో పాటు రైతు బజార్లలోనూ క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు ఆదేశించారు. బెల్టు షాపులను ఏమాత్రం ఉపేక్షించొద్దని సీఎం స్పష్టం చేశారు.
రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్షించిన సీఎం, వాట్సప్ గవర్నెన్స్ అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలా మందికి వాట్సప్ గవర్నెన్స్ ఎలా ఉపయోగించాలో తెలియడంలేదన్న సీఎం, ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన పెంచాలన్నారు. ఈ వ్యవస్థపై సచివాలయాల్లో అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజల్లో అవగాహనకు క్యూఆర్ కోడ్ ప్రదర్శించాలన్నారు. ప్రజలు చెల్లించే బిల్లులు వాట్సప్ ద్వారా ఎక్కువ జరగాలన్నారు. ఈ వ్యవస్థతో ప్రజల వినతులు, పరిష్కారాలు మెరుగవ్వాలన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరం చేయటమే వాట్సప్ గవర్నెన్స్ లక్ష్యమని స్పష్టం చేశారు. వాట్సప్ గవర్నెన్స్, పౌరసేవలు, బెల్టు దుకాణాలు, నిత్యావసర ధరలపై అధికారులతో సీఎం సమీక్షించారు.
శాంతిభద్రతల పర్యవేక్షణలో టెక్నాలజీని వాడుకోవాలని, పోలీసు గస్తీకి సమాంతరంగా డ్రోన్లను ఉపయోగించుకుని డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలా చేస్తే గస్తీ ప్రక్రియ సులభతరమై సత్ఫలితాలు వస్తాయన్నారు. ఆర్టీజీఎస్‌లో డేటా లేక్ ఏర్పాటు కోసం డేటా అనుసంధాన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులన్నిటికీ జీపీఎస్ వ్యవస్థ ఉండాలని, గూగుల్ సహకారం తీసుకుని ఈ వ్యవస్థను త్వరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీకి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ పెట్టి పర్యవేక్షించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు.