Pratidhwani : బెట్టింగ్ బంగార్రాజులు బీకేర్‌ఫుల్! ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు హానికరం! ఆర్థికంగా నష్టాలే కాదు అవి ప్రాణాంతకం కూడా. ఎంతోకాలంగా ఈ మాట చెబుతున్నా పెడ చెవిన పెడుతున్న వారికి, డబ్బుల కోసం బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వారికి, హెచ్చరిక లాంటి పరిణామం ఇది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం చేస్తున్న నాని, అలియాస్ లోకల్‌బాయ్ నానిని విశాఖ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేయడమే ఇందుకు కారణం.
అసలు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసేవారిపై చట్టాలు కేంద్ర ప్రభుత్వం, 2022లో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఆ యాప్‌ల ఊబిలో చిక్కి జీవితాలే నష్టపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న దీనగాథల నేపథ్యంలో ఇంకా ఎలాంటి చర్యలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్నవారు ఇండియన్ సర్వర్స్ సీఈవో సాయి సతీష్,సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఐ.ఎల్. నరసింహారావు.
ఆన్‌లైన్ ఆటలు, బెట్టింగ్ యాప్‌లు జీవితాల్నే ఛిద్రం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు వాటిని అరికట్టటానికి ఎంతవరకు దోహదపడతాయి? సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కూడా పదేపదే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిని హెచ్చరిస్తునే ఉన్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలకున్న అవకాశాలేమిటి? బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసేవారిపై గతేడాది కేంద్ర ప్రభుత్వం, 2022లో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ ముఠాల్ని మూలాల్నుంచి తొలగించడంలో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి? బెట్టింగ్, గేమింగ్ ముఠాలపై దొరికే ఆధారాలతో వారి నెట్‌వర్క్‌లో ఎంత వరకు చేధించగలుగుతున్నాం?
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో వ్యక్తి బలి
నిజానికి చాలా వరకు మోసపూరిత యాప్‌లను ప్లేస్టోర్ వంటివే అనుమతించవు. అయినా ఇవి ఏ ఏ రూపాల్లో ప్రజల్లోకి చేరుతున్నాయి. వాటిని అడ్డుకోవడం ఎలా? బెట్టింగ్ మాఫియాలకు క్రికెట్ సీజన్ మరీ ముఖ్యంగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న IPL వంటివి పండగ రోజులు. పోలీసులు ఈ సవాల్ అధిగమించడం ఎలా? విశాఖ ఒక్కచోటే కాదు ఎంతోమంది ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు.. తెలిసో, తెలియకో వివిధరకాల ప్రమోషన్లు చేస్తునే ఉన్నారు. వారంతా ఇకనైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏ యాప్‌లను ప్లే స్టోర్‌లో గానీ, ఏపీకే ఫైల్స్ రూపంలో గానీ జనం మధ్యకు రాకుండా చేయాలంటే ఎలాంటి వ్యవస్థ అవసరం? మీరైతే ఏం చేస్తారు? ఫలాన సోషల్ మీడియా వేదికలపై అలాంటి ప్రమోషన్‌ను చూసినట్టయితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా చేయాలి అనే విషయంలో తగిన ప్రచారం ఎందుకు జరగట్లేదు? అనే అంశాలపై సమగ్ర సమాచారం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.