CM Chandrababu on Free Gas Cylinders Distribution Scheme:మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తిరుమల ప్రసాదం అపవిత్రం:జగన్ పాలనలో తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దేవుడి ప్రసాదం అపవిత్రం చేసేలా నాసిరకం పదార్థాలు వాడారని మండిపడ్డారు. గతంలో తిరుమల లడ్డూ నాణ్యత సరిగా లేదని వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదానంలో కూడా నాణ్యత పాటించలేదని అన్నారు. దేవుడి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యి వాడాలని ఆదేశించినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రసాదం నాణ్యత పెరిగిందని స్వామివారి పవిత్రతను కాపాడుకోవాల్సి బాధ్యత ఉందని సీఎం చంద్రబాబు వివరించారు.
ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమాలు అమలు:మంత్రివర్గ భేటీలో చాలా సమస్యలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా వరద బాధితుందరికీ సాయం అందించడమే కూటి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గుంతలు పూడ్చేందుకు రూ.500 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అంతే కాకుండా రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో రహదారులకు రూ.58 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామాల్లోని రోడ్డు నిర్వహణ కోసం రూ. 49 వేల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది వివరించారు. జల్‌జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామని అన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకురాబోతున్నాయని తెలిపారు.