Chandrababu on Amaravati Drone Summit : భారతదేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్‌కు అమరావతి వేదిక కానుండటం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అక్టోబరు 22, 23 తేదీల్లో 5,500 డ్రోన్‌లతో అద్భుతమైన డ్రోన్ షో జరగనుందని చెప్పారు. అమరావతి కేంద్రంగా అతిపెద్ద డ్రోన్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ టెక్, ఇన్నోవేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ఇది కీలక పరిణామం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.డ్రోన్ నిపుణులతో కలిసి ఈ అతిపెద్ద వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
మరోవైపు అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు ఔత్సాహికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. డ్రోన్ హ్యక్‌థాన్‌కు యువత భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇప్పటికే 400 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఔత్సాహికుల సౌలభ్యం కోసం నమోదు గడువును మరో రెండ్రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం (17వ తేదీ) వరకు హ్యాక్‌థాన్ పోటీకి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. నగదు బహుమతి కూడా పెంచామని వెల్లడించారు.