Chandrababu Polavaram Tour Today : వైఎస్సార్సీపీ రివర్స్ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన పోలవరానికి జవసత్త్వాలిచ్చి పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రాజెక్టు పరిశీలన చేసి భవిష్యత్‌లో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. పనుల్ని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజినీర్లతో సీఎం సమీక్షిస్తారు.
అధికారం చేపట్టిన వెంటనే తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన చంద్రబాబు ప్రాజెక్టుపై తనకున్న అంకితభావం ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతినెలా ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి, పనులపై ఆయన సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే నేడు పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు.
2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్‌ను సీఎం వెల్లడించనున్నారు. డయాఫ్రంవాల్ నిర్మాణంతోపాటు ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంగిన గైడ్‌బండ్‌ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు. స్పిల్ ఛానల్‌లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్నారు.