Sankranti Rush in AP 2025 : రాష్ట్రంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రాంతాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాలకు 116 అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని పేర్కొంది. సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది.
ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఈ క్రమంలోనే కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. మరోవైపు తెలంగాణలోని పంతంగి టోల్‌ప్లాజా వద్దకు భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. పంతంగి టోల్‌ప్లాజాలోని 12 టోల్‌బూత్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు వాహనాలను అనుమతిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
సురక్షితంగా గమ్యం చేరండి: సంక్రాంతి పండుగ ముగించుకుని తిరుగు పయనమయ్యే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజయవాడ నుండి హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఇప్పటికే పలు ప్రత్యేక ఏర్పాటు చేశామని అన్నారు. ప్రయాణికులంతా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.