Bullet Byke for Cockfight Winners: రాష్ట్రంలో మూడు రోజులు సంక్రాంతి పండగ సంబరంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న రాష్ట్రానికి చెందిన ప్రజలు గ్రామాలకు చేరుకుని సంతోషంగా గడిపారు. ఇక ఈ మూడు రోజులు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో అనేక రకాల పోటీలు జరిగాయి. ఇందులో ముఖ్యమైనవి కోడి పందేలు. ఈ కోడి పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈ కోడిపందేలను చూసేందుకే ఈ రాష్ట్రానికి చెందిన వారే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలు వస్తారంటే ఆశ్చర్యపోక తప్పదు.
ఇక ఈ కోడిపందేలకు చేసిన ఏర్పాట్లు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. కొన్నిచోట్ల పెళ్లిపందిళ్లకు మించి ఏర్పాట్లు చేశారు. అంతేకాదు పోటీల్లో పాల్గొన్నవారందరికీ బ్రహ్మాండమైన భోజనాలను సైతం వడ్డించారు. కమ్మటి రుచులతో పసందైన కోడిపందేలు చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. కోడిపందేలకు వచ్చిన వారు డబ్బుల కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా బరులు ఏర్పాటు చేసిన దగ్గరే మినీ ఏటీఎంలను సైతం ఏర్పాటు చేశారు.
ఈ మూడు రోజులు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. వాహనాలన్నీ కోడిపందేల బరులవైపే బారులు తీరాయి. ఇక కోడిపందేల బరులన్నీ క్రికెట్ స్టేడియాలను తలపించాయి. ఈ పందేలకు రాజకీయ పార్టీ సభలకు వచ్చిన తరహాలో వాహనాలు రావడం విశేషం. పలుచోట్ల ఈసారి కోడిపందేల విజేతలకు వినూత్నంగా బహుమతులు అందజేశారు. ఎక్కువ పందేలు గెలిచిన కోళ్ల యజమానులకు థార్ వాహనం, బుల్లెట్లు అందజేశారు.
ఏలూరు జిల్లా జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో కోడిపందాలు ఆకర్షణీయంగా నిలిచాయి. పందాలు కోళ్లకే కాదు వాటిని పెంచి బరిలో దింపిన వారికి కూడా అని ప్రచారాలు చేశారు. దీంతో భారీస్థాయిలో ఈ పందేలలో పాల్గొన్నారు. చెప్పిన విధంగానే మొత్తం 9 కోడిపందేలు జరగగా, అందులో 5 పందేలు గెలిచిన వారికి లేటెస్ట్ మోడల్ బుల్లెట్ బహుమతిగా అందజేశారు.
ఈ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన కడియాలు శివ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన బండారు నాని మరియు జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు ఈ బహుమతులు దక్కాయి. తెలుగు సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో బహుమతులు రావడం తమకు సంతోషంగా ఉందని విజేతలు తెలిపారు.
బుల్లెట్ బండ్లు, థార్ జీప్ - కోడి పందేల్లో గెలిచినోళ్లకే లక్