ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

72 రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు - రెండేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష - రైల్వే, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం

CM_Chandrababu_on_Railway_Projects
CM Chandrababu on Railway Projects (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

CM Reviews on Railway Projects: ఆంధ్రప్రదేశ్​లోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల సత్వర పూర్తికి, భూసేకరణ సమస్యల పరిష్కారానికి రైల్వే, రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. డబ్లింగ్ సహా ఇతర ప్రాజెక్టు పనులన్నీ 4 ఏళ్లలో పూర్తి చెయ్యాలని లక్ష్యం నిర్థేశించారు. 72 రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ది పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పాజెక్టుకు నిర్థేశిత సమయం పెట్టుకుని పూర్తి చెయ్యాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ప్రతి ప్రాజెక్టు పురోగతిపై చర్చించిన చంద్రబాబు, ఆయా ప్రాజెక్టుల్లో జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా రైల్వే ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని, నేడు అన్ని ప్రాజెక్టులు వేగంగా పూర్తి చెయ్యాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూసేకరణ సమస్యలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కోటిపల్లి - నర్సాపూర్ రైల్వే లైన్​కు నాలుగు నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. నడికుడి - శ్రీకాళహస్తి మార్గంలో 11 ఎకరాల భూసేకరణకు 20 కోట్లు వెంటనే ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.

వెయ్యి కోట్లతో అమరావతి రైల్వే లైన్ - పనులు వేగవంతం - New Amaravati Railway Line

మూడు ఏళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తిచెయ్యాలి: సత్తుపల్లి - కొవ్వూరు లైన్ కు భూ సేకరణ పూర్తి చేసి ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. కడప - బెంగుళూరు లైన్ అలైన్​మెంట్లో మార్పులు జరిగాయని, దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. రేణిగుంట- గూడూరు 83 కి.మీ 3వ లైన్ పనులు 884 కోట్లతో చేపట్టాలని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 4 నెలల్లో భూ సేకరణ పూర్తి చేసి, మూడు ఏళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తిచెయ్యాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదలై పనులు జరుగుతున్న అన్ని రైల్వే ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తిచెయ్యాలని స్పష్టం చేశారు. డబ్లింగ్ పనులు నాలుగేళ్లలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. గుంటూరు - గుంతకల్ డబ్లింగ్ పనుల కింద చేపట్టిన 401 కిలోమీటర్ల లైన్ పనులను 12 నెల్లలోనే పూర్తి చెయ్యాలన్నారు.

మార్చి నాటికి పూర్తి: అమృత్ ప్రాజెక్టు కింద కుప్పం రైల్వే స్టేషన్​ను 6.98 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని అధికారులు తెలపగా, స్టేషన్ డిజైన్లు మెరుగుపరచాలని సూచించారు. 433 కోట్లతో విశాఖపట్నం స్టేషన్, 24 కోట్లతో విజయవాడ గుణదల స్టేషన్ పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుణదల స్టేషన్ పనులను మార్చినాటికి పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 40 కోట్లతో జరగుతున్న గుంటూరు స్టేషన్ అభివృద్ది పనులు, కర్నూలు స్టేషన్ అభివృద్ది పనులు వెంటనే పూర్తి చెయ్యాలన్నారు. మొత్తం 72 స్టేషన్లలో 3 వేల 170 కోట్లతో జరుగుతున్న అభివృద్ది పనులు రెండున్నరేళ్లలో పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్థేశించారు.

ఎర్రుపాలెం -అమరావతి - నంబూరు రైల్వే లైన్​కు 2 వేల 239 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 390 లెవల్ క్రాసింగ్​లు ఉండగా, ప్రస్తుతం 83 ఆర్వోబీలు ఉన్నాయని అధికారులు వివరించారు. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయని, 285 ఆర్వోబీలు మంజూరు కావాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా పలు ఇతర కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. ఆయా మార్గాలు ఏఏ ప్రాంతాల గుండా వెళుతున్నాయనే విషయంలో సీఎం అధికారులతో చర్చించారు. మరికొంత సమగ్ర సమాచారంతో కొత్తలైన్లపై చర్చించాల్సి ఉందన్నారు. ఈ సమీక్షలో మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి, రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

విజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత - ఎన్‌ఎస్‌జీ1గా గుర్తింపు - NSG 1 designation for Vijayawada

ABOUT THE AUTHOR

...view details