CM Chandrababu Naidu Review Meeting in Tirumala : ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు తిరుమలలో పర్యటించారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
తిరుమల కొండపై గోవిందనామస్మరణ తప్ప మరోమాట వినిపించకూడదని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావివ్వొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. తిరుమల పర్యటనలో ఉన్న ఆయన రెండోరోజు పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్షించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు.
టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకోవాలని ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల సూచనల ఆధారంగా టీటీడీ సేవలు అందించాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తుల నుంచి సూచనలు తీసుకోవాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని ఇదే విధానం ఎల్లప్పుడూ కొనసాగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని చంద్రబాబు సూచించారు.
తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు - cm chandrababu tirumala tour