ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు - CM CHANDRABABU VISITS POLAVARAM

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం - భవిష్యత్తు నిర్మాణాల షెడ్యూల్ విడుదల

CM_Chandrababu_polavaram_tour
CM Chandrababu polavaram tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

CM Chandrababu Visits Polavaram: సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా విహంగ వీక్షణం ద్వారా సీఎం ప్రాజెక్టును పర్యవేక్షించారు. తర్వాత హిల్‌ వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టుని పరిశీలించారు. పోలవరం గ్యాప్‌ -1, గ్యాప్​-2, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులను సీఎం పరిశీలించారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు భవిష్యత్తు నిర్మాణాల షెడ్యూల్​ను విడుదల చేశారు.

ప్రాజెక్టుని పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అని సీఎం అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి తెలిపారు. పోలవరం వల్ల 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని వెల్లడించారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌గా తయారవుతుందని స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశామన్న సీఎం, గొల్లాపల్లి రిజర్వాయర్‌ వస్తే చాలావరకు ఇబ్బంది ఉండదని వెల్లడించారు. వెలిగొండ ఇరిగేషన్‌కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని, అక్కణ్నుంచి బనకచర్లకు తీసుకెళ్లొచ్చని అన్నారు. నేరుగా విశాఖకు తరలిస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధారకు వెళ్తుందని, ఇవి పూర్తిచేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగకరమని పేర్కొన్నారు.

2019 వరకు రేయింబవళ్లు పనిచేశాం: శ్రీకాకుళం నుంచి కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వరకు నీటి సమస్య ఉండదని, ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్‌ చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. 93 మీటర్లు డయా ఫ్రం వాల్‌, అత్యంత ఎత్తైన స్పిల్‌ వే గేట్లు, బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్టు పోలవరం అని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు రేయింబవళ్లు పనిచేశామని, ముందుజాగ్రత్త చర్యతో 2014లో సీఎం కాగానే ఏడు ముంపు మండలాలు ఇవ్వకపోతే ప్రమాణం చేయనని చెప్పానని గుర్తు చేశారు.

28 సార్లు క్షేత్రస్థాయి పరిశీలన చేశా: మొదటి కేబినెట్‌ పెట్టుకుని 7 మండలాలు ఇచ్చిన తర్వాతే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేశారని, ఒక్క రోజులో స్పిల్‌ ఛానల్‌లో 32 వేల 215 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి గిన్నిస్‌ రికార్డు కూడా బ్రేక్‌ చేశామని తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ రెండూ పూర్తిచేశామని, డయాఫ్రం వాల్‌ను 414 రోజుల్లో పూర్తిచేసినట్లు వెల్లడించారు. 2 కిలో మీటర్ల పొడవుతో దాదాపు 100 మీటర్లు డయాఫ్రం వాల్‌కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. స్పిల్‌వే గేట్లన్నీ డిజైన్‌ చేసి గేట్లన్నీ అమర్చామని, ప్రతి పనిని పీపీఏ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అనుమతిస్తూ వచ్చారన్నారు. 72 శాతం పనులు పూర్తిచేశామని, 28 సార్లు క్షేత్రస్థాయి పరిశీలన చేశానని గుర్తు చేశారు.

రెండో వారంలో పోలవరానికి సీఎం చంద్రబాబు - పనుల షెడ్యూల్​ ప్రకటన

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో సర్వనాశనం చేశారు: 82 సార్లు వర్చువల్‌గా సమీక్షలు చేశానన్న సీఎం, సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్టర్‌ను మారుస్తామని చెప్పారని, బలవంతంగా 2019 జులైలో నోటీసులిచ్చి సైట్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. 15 నెలలపాటు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని, రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 50 లక్షల క్యూసెక్కుల నీళ్లు డిశ్చార్జ్‌కు మనం నిర్మాణాలు చేశామన్న సీఎం, ఆగస్టు, అక్టోబర్‌లో వరదలకు డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.

దాని తర్వాత పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని, పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అసమర్థత, అవగాహనరాహిత్యం, అవినీతి, కుట్ర అన్నీ కలిపి పోలవరాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో రెండూ కాఫర్‌ డ్యామ్‌ల వద్ద నీరు చేరి దెబ్బతినే పరిస్థితి వచ్చిందని, రూ.2400 కోట్లు అదనంగా అయిందని అన్నారు. న్యూ డయాఫ్రం వాల్‌ రూ.990 కోట్లు అవుతుందని, అప్పట్లో ఇది రూ.440 కోట్లతో పూర్తి చేశామని పేర్కొన్నారు. శాండ్ ఫిల్లింగ్‌కు రూ.360 కోట్లు ఖర్చయ్యిందని, మొత్తం కలిసి రూ.2,400 కోట్లు అదనంగా ఖర్చయ్యిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు.

పోలవరం పనుల పురోగతిపై వెబ్​సైట్ - సాగునీటి సంఘాల ఎన్నికలపై మంత్రి సమీక్ష

Polavaram Project Construction Schedule: ఐఐటీహెచ్‌ (IIT Hyderabad) వాళ్లు వచ్చి డయాఫ్రం వాల్‌పై వాస్తవాలు చెప్పారని, పోలవరం ఇప్పటివరకు 76.79 శాతం పూర్తయ్యిందని వెల్లడించారు. కేంద్రం రూ.12 వేల 157 కోట్లకు అనుమతి ఇచ్చిందని, లెఫ్ట్ కెనాల్‌ను అనకాపల్లి వరకు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. ఏ పని ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టంగా చెప్పేందుకే వచ్చానన్న సీఎం, దెబ్బతిన్న పాత డయాఫ్రం వాల్ స్థానంలో కొత్తది నిర్మిస్తున్నామని అన్నారు. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని చెప్పానన్నారు.

2026 జూన్‌లోగా ఈసీఐఆర్ గ్యాప్‌-2 పనులు, 2026 జూన్‌లోగా అప్రోచ్ ఛానల్ పనులు, 16 వేల 400 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. 2026లోగా ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి చేసేలా కార్యాచరణ పెట్టుకున్నామని, పోలవరాన్ని 2026 అక్టోబర్‌ నాటికి పూర్తి చేయాలనేది టార్గెట్‌ అని స్పష్టం చేశారు.

పోలవరం ఎత్తుపై స్పష్టమైన కార్యాచరణ: రెండోదశ త్వరగా పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామని, నదుల అనుసంధానం దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరతామన్నారు. పోలవరం ఎత్తుపై స్పష్టమైన కార్యాచరణ దిశగా ముందుకెళ్తామన్నారు. గత ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల బాధ, ఆవేదన కలుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో మేం మళ్లీ అధికారంలోకి వస్తే 2021లోగా ప్రాజెక్టు పూర్తయ్యేదని, పట్టిసీమను ఎగతాళి చేశారని, ఇప్పడదే దిక్కయ్యిందని పేర్కొన్నారు.

పోలవరం కోసం పండుగరోజు కూడా పుణె వెళ్లి కేంద్రమంత్రిని కలిశానని, కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయనే తాము తీసుకున్నామన్నారు. మనకు అత్యవసరం కనుక త్వరగా పూర్తి చేస్తామనే తమకిచ్చారని, ప్రజాధనం దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని అన్నారు.

పోలవరం ఎత్తుపై రాజ్యసభలో చర్చ - ఆ విషయంలో తగ్గేదేలేదని వెల్లడి

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details