CM Chandrababu Naidu Meeting: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వెళ్లారు. ముందుగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు వెంట కదిలారు. పూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలికారు. జైబాబు జైజై బాబు నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బోనాలతో మహిళలు సాదర స్వాగతం పలికారు. కార్యకర్తల ఆనందోత్సహాల మధ్య ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న చంద్రబాబు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కూటమి విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. విభజన కంటే గత ఐదేళ్ల వైకాపా పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్‌గా ఎదగాలనేదే తన ఆకాంక్షని చంద్రబాబు తెలిపారు. తొలిసారిగా సీఎం అయిన 1995లో ఎలా పనిచేశానో ఇప్పుడు ఆలాగే పనిచేస్తానని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఏపీ, తెలంగాణ నా రెండు కళ్లు- తెలంగాణ గడ్డపై పార్టీకి పునర్‌వైభవం వస్తుంది: చంద్రబాబు - CM Chandrababu Rally in Hyderabad
హైటెక్‌సిటీ, ఐటీ సెక్టార్‌కు సంబంధించి పాతికేళ్ల క్రితం వేసిన ముందడుగులే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశాయన్నారు. తెలుగు వారు గ్లోబల్ లీడర్స్‌గా ఎదిగాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య తలసరి ఆదాయం 35 శాతం వ్యత్యాసం ఉండేదని దానిని అయిదేళ్ల పాటు కష్టపడి తగ్గించానని గుర్తుచేశారు.
గడిచిన అయిదేళ్లు భూతం పాలించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలు, పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా కూడా తన లక్ష్యం ఒకటే అని, తెలుగు జాతి అభివృద్ధి, దేశంలో తెలుగు రాష్ట్రాల మొదటి స్థానంలో ఉండడమే అని అన్నారు. ఆ మేరకే చర్చలు జరిపినట్లు, తెలంగాణ, ఆంధ్ర ప్రజల మనోభావాల మేరకే రేవంత్‌తో కలిసి ముందడుగు వేస్తామని తెలిపారు.
మూడంచెల విధానంతో విభజన సమస్యలకు పరిష్కారం- నిర్ణయించిన చంద్రబాబు, రేవంత్ సమావేశం - AP TELANGANA CMS MEETING
తెలుగు తమ్ముళ్ల జోష్ చూస్తుంటే, తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వచ్చేలా ఉందనిపిస్తుందని అన్నారు. 1982లో పార్టీ స్థాపించినప్పుడు ఉన్న పరిస్థితులను గుర్తుచేస్తూ, తెలుగు జాతి ఉన్నంతకాలం పసుపు జెండా ఉంటుందన్నారు. అక్రమంగా తనను జైళ్లో పెట్టినప్పుడు తెలుగు ప్రజలు చూపిన అభిమానాన్ని ఆజన్మాంతం గుర్తుంచుకుంటానని అన్నారు.
ఇంటినుంచి పార్టీ ఆఫీసు వరకు ఆయనకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే మరో జన్మంటూ ఉంటే ఇదే తెలుగుగడ్డపై పుట్టించాలని భగవంతుణ్ని వేడుకుంటున్నానని అనడంతో పార్టీ శ్రేణుల కేరింతలు అంబరాన్నంటాయి. సీబీఎన్ @1995 పేరుతో నిరంతరం శ్రమించి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతూ, మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణ టీడీపీ శ్రేణులు చంద్రబాబును ఘనంగా సన్మానించారు.
ఐదేళ్లపాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu naidu Chit Chat