Chandrababu on Investments in AP : పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారవర్గాలకు పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయన రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. రాష్ట్రం ఇప్పుడు సరికొత్త, అత్యుత్తమ విధానాలతో ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. ఏపీ ఇప్పుడు పూర్తిగా వ్యాపార అనుకూలమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన యువత, అద్భుత మౌలిక సదుపాయాలు, సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు వివరించారు.
పరిశ్రమ అనుభవజ్ఞులతో సమగ్ర సంప్రదింపుల తర్వాత కొత్త పాలసీ ఫ్రేమ్ వర్క్ రూపొందించినట్లు చంద్రబాబు వెల్లడించారు. వ్యవస్థాపక స్ఫూర్తిని, వ్యాపారాలను పెంపొందించడమే లక్ష్యంగా పాలసీ ఫ్రేమ్ వర్క్ జరిగిందని చెప్పారు. దేశంలో అత్యుత్తమ వ్యాపార అనుకూల వ్యవస్థను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. పారిశ్రామిక పునాదిని ఏర్పరచుకుని అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇంతకంటే మంచి సమయం లేదు : భారతదేశంలో మరీ ముఖ్యంగా ఏపీలో పెట్టుబడులకు ఇంతకంటే మంచి సమయం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఉత్తేజకర వృద్ధి ప్రయాణంలో తమతో కలసిరావాలని ఆయన కోరారు. వ్యాపార పరిధులు, తమ రాష్ట్ర సామర్థ్యాన్ని పరస్పరం విస్తరించుకునే అవకాశం ఇదేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన పెట్టుబడులు చూసేందుకు ఎదురుచూస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు.