Chandrababu on Visakha Metro Rail Project :విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది.
ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు :ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను చంద్రబాబు ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీ యూజేఎమ్ రావుకు తెలియజేశారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు నగర పరిధిలో పలుచోట్ల పైవంతెనల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించాక మెట్రో కోసం మళ్లీ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జగనన్నా ఇదేనా నీ చిత్తశుద్ధి - ఎన్నికల ముందు విశాఖ మెట్రో అంటూ ఎందుకీ హడావుడి?
ఉన్నవాటిని కూల్చడం, మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు తెచ్చిపెడతాయని భావించారు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్‌హెచ్‌ఏఐకు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని సూత్రప్రాయంగా సీఎం ఆ సమీక్షలో తెలియజేశారు. ప్రస్తుతం విశాఖలో 12 పైవంతెనలు నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్ రూపొందించింది. ఆయాచోట్ల స్తంభాల చుట్టుకొలత పెంచడం, అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. త్వరలో వాటిపై స్పష్టత రానుంది.