CM Chandrababu Naidu Delhi Tour :రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2 రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని, అలాగే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి వివరించానని అన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కోరామని తెలిపారు.
అమరావతి నుంచి విజయవాడ రైల్వే లైన్ :రాష్ట్రంలోని జాతీయ రహదారుల పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రధానిని కోరానని సీఎం తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ రాయితీ గురించి వివరించాను. డిసెంబరు నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభమవుతాయని, విశాఖ రైల్వే జోన్ గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడానని, విశాఖ రైల్వే జోన్‌కు భూమి ఇవ్వలేక ఐదేళ్లు కాలయాపన చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక విశాఖ రైల్వే జోన్‌కు భూమి కేటాయించామని, విశాఖ రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఫోర్ లైన్లు వేయాలని, అమరావతి నుంచి విజయవాడ రైల్వే లైను, మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైన్ కనెక్ట్ చేయాలని, నరసాపురం- మచిలీపట్నం, రేపల్లె-బాపట్ల లైన్లు ఇవ్వాలని రైల్వే మంత్రిని కోరానని తెలిపారు.
చంద్రబాబు దిల్లీ టూర్ అప్డేట్స్ - విశాఖ రైల్వే జోన్‌కు శ్రీకారం
2027లోగా బుల్లెట్ రైలు! :సౌత్ ఇండియాలో 4 ముఖ్యమైన నగరాలను హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు అనుసంధానం చేసేలా బుల్లెట్ రైలు నడపేలా చర్యలు తీసుకోవాలని కోరామని, ఈ 4 ఎకానమిక్ హబ్‌లను కవర్ చేస్తూ బుల్లెట్ రైలు పెడితే ఆర్థికపరమైన కార్యలాపాలు మరింతగా పెరుగుతాయని చెప్పామని అన్నారు. 2027 నాటికి పనులు ప్రారంభం కావొచ్చని అన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని కోరామని, కొన్ని రైల్వే లైన్లకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు. దానిపై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఐటీ లిటరసీ, డిజిటల్ హబ్ పెట్టాలని కేంద్రాన్ని, డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరామని, వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఏఐ సాయంతో వచ్చే స్టార్టప్‌లను మరింత ప్రోత్సహిస్తామని, క్లౌడ్‌లో ఉన్న నాలెడ్జ్‌ను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపారు.