CM Chandrababu Naidu Attend Parent Teacher Meeting in Bapatla :రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున నేడు తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. శనివారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ ఉదయం ప్రారంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా విద్యాశాఖ నిర్వహిస్తోంది.
టగ్ ఆఫ్ వార్‌లో పాల్గొన్న చంద్రబాబు :బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలను పరిశీలించారు. వారి విద్యాభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. వారితో ముఖాముఖి సంభాషించిన ముఖ్యమంత్రి పిల్లల జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు ఆయన విన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు. బాపట్లలో విద్యార్థుల క్రీడా పోటీలను చంద్రబాబు ప్రారంభించారు. సరదాగా కాసేపు వారితో కలిసి టగ్ ఆఫ్ వార్‌లో పాల్గొన్నారు.
డ్రగ్స్‌ను కూరగాయ పంటల్లా సాగు చేస్తున్నారు :పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, వారు స్మార్ట్‌ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని చంద్రబాబు తెలిపారు. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు అన్నారు. మానవ సంబంధాలను డ్రగ్స్ నాశనం చేస్తాయని తెలిపారు. కొందరు డ్రగ్స్‌ను కూరగాయ పంటల్లా సాగు చేస్తున్నారన్న ఆయన వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు. ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. డ్రగ్స్ రక్కసిని కర్కశంగా అణచి వేస్తామని తేల్చి చెప్పారు.
డ్రగ్స్ వద్దు బ్రో :గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలతో వచ్చే అనర్థాలపై బాపట్లలో నిర్వహించిన మెగా పేరెంట్స్ - టీచర్ మీట్లో విద్యార్థి చేసిన ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ జాన్ ప్రకాష్ సూచించారు. 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ పిలుపునివ్వడంతో సీఎం చంద్రబాబు ప్రశంసించారు.