ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంచిని బలంగా చెప్పండి - వైఎస్సార్సీపీ చెడును తిప్పికొట్టండి'

ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం - ఎమ్మెల్యేల నుంచి సలహాలు స్వీకరించిన చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

CM_MEETING_WITH_TDP_LEADERS
CM_MEETING_WITH_TDP_LEADERS (ETV Bharat)

CM Chandrababu Meeting With TDP Leaders :టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశానికి దాదాపు 25 మంది గైర్హాజరవ్వడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు సహా పలువురు సమావేశానికి రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై వారం రోజుల ముందే షెడ్యూలు విడుదల చేస్తామని తెలిపారు. నాయకులకు ఎన్ని పనులు ఉన్నా, ఏస్థాయి నాయకులైనా సరే తప్పకుండా సమావేశానికి రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

కీలక అంశాలపై దిశానిర్దేశం :టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాదాపు 7 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో నేతలకు చంద్రబాబు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వారు ఎంతటి వారైనా క్షమించేది లేదని గట్టిగా హెచ్చరించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న దుష్ప్రచారంపై కొందరు నేతలు ఇంకా మౌనం వీడకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు గట్టిగా తిప్పికొట్టడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వసూలు చేసినా ఎక్కడికక్కడ గుట్టలుగా చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నా ప్రజలకు ఎందుకు వివరించడం లేదని మండిపడ్డారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:ఇటీవల చెత్తపై పన్ను రద్దు చేయడం సహా ప్రజలకు మేలు జరిగే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని కానీ అవి ఆశించిన మేర ప్రజలకు చేరలేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.

"ఆ ఆరు పాలసీలే గేమ్ ఛేంజర్" - మద్యంలో వేలు పెడతామంటే కుదరదు : చంద్రబాబు వార్నింగ్

ఎమ్మెల్యేల విన్నపలు : ప్రజాప్రతినిధుల నుంచీ చంద్రబాబు సలహాలు స్వీకరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు వెంటనే నియమించాలని వాటిల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని నేతలు కోరగా పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారు. 2014-19 హయాంలో చేసిన నీరు-చెట్టు పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఎమ్మెల్యేలు కోరారు. సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లను తమ శాఖకు కేటాయించాలని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు.

పారిశ్రామిక పార్కు అభివృద్ధి : ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందిలో ఐదుగురిని కేటాయించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. నగరి నియోజకవర్గంలో కోశలనగరం పారిశ్రామిక పార్కు అభివృద్ధి( Development of Industrial Park) చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ కోరగా చంద్రబాబు అంగీకరించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లింపు నిలిపేసిందని, వాటిని చెల్లించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు.

"సమయం లేదు మిత్రమా" - ఏపీలో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!

సిలికాశాండ్‌ తవ్వకాల కోసం మైనింగ్ డీలర్ల లైసెన్స్‌లు ఇవ్వాలని కొందరు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. చిన్న నిర్మాణాల కోసం టన్ను, అరటన్ను ఇసుక అవసరమైన వారి కోసం విశాఖలో శాండ్ డిపోలు ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాజ్జి కోరారు. సింహాచలం పంచగ్రామాల సమస్యనూ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవీ భర్తీ చేసి త్వరగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.

డ్రోన్‌ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా : ముఖ్యమంత్రి చంద్రబాబు

అనర్హులకు పెద్దఎత్తున పింఛన్లు :మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే పథకాన్ని త్వరగా ప్రారంభించాలని ఎక్కువ మంది దీని గురించే ప్రశ్నిస్తున్నారని గౌతు శిరీష చంద్రబాబు సూచించారు. అలాగే వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు పెద్దఎత్తున పింఛన్లు మంజూరు చేశారని విచారణ జరిపి వాటిని తొలగించాలని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు తెలిపారు. ఆప్కాస్‌ పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని వీటినీ సమీక్షించాలని కోరారు.

ఎమ్మెల్యేలు చాలా అంచనాలతో ఉన్నారని నిధులు, అధికారాలు కోరుకుంటున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పనితీరు బాగుంటేనే వాటిపై ఆలోచిస్తానని వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈసారి చాలామంది ఎమ్మెల్యేలు కొత్తవారు ఉన్నారని తాను చెప్పేది వారితో పాటు సీనియర్లకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. చాలామంది పనితీరులో ఇంకా మార్పు రావాలని ఆయన గట్టిగా మందలించినట్లు తెలిసింది.

"శభాష్ పవన్ కల్యాణ్ - ఎంతో ఆనందంగా ఉంది" - అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details