CM Chandrababu Inaugurated National Drone Summit in Amaravati : అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు వచ్చిన డ్రోన్ తయారీదారు సంస్థల ప్రతినిధులకు చంద్రబాబు వేసిన ప్రశ్నలు
- జనసమూహంలో కలిసిపోయి అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నించే రౌడీషీటర్లను గుర్తించే డ్రోన్ సాంకేతికత ఉందా?
- డంపింగ్ యార్డులు, చెత్తకుండీల్లో ఎంత వ్యర్థాలున్నాయో డ్రోన్‌తో అంచనా వేయగలమా?
- రోడ్ల మీద గుంతల లోతును, పంట కాలువల్లో పూడికను డ్రోన్‌తో లెక్కగట్టగలమా?
- రహదారుల్లో గుంతలు, కాలువల్లో పూడికనూ డ్రోన్‌తో లెక్కించగలమా?
వీటన్నింటికోసం సాంకేతికతలు ఇప్పుడు అత్యవసరమని, ఆ దిశగా వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగంపై చేసే వినూత్న ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మార్కెటింగ్ కల్పించడంతోపాటు రాయితీలు అందిస్తామని చంద్రబాబు ఇన్వెస్టర్లుకు హామీ ఇచ్చారు. డ్రోన్ల ద్వారా పంటలకు ఎరువుల వినియోగంతోపాటు ఇంకా వినూత్నంగా ఏం చేయొచ్చో ఆలోచించాలని నిర్వాహకులకు సీఎం సూచించారు. వాటిని ఖర్చు తగ్గింపుతోపాటు ప్రభావవంతంగా పని చేసేలా చూడాలన్నారు. భూమిలో సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించే సాంకేతికతను రూపొందించాలని, సాధారణ రైతులు కూడా ఉపయోగించి, అధిక ప్రయోజనాలు పొందే విధంగా ప్రయోగాలు ఉండాలని సీఎం వారికి నిర్దేశించారు. అమరావతి డ్రోన్ సమ్మిట్-2024లో భాగంగా ఏర్పాటు చేసిన డ్రోన్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లను సందర్శించి నిపుణులతో ముఖాముఖీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు డ్రోన్ సాంకేతికత అనుసంధానం గురించి వారితో చర్చించారు.
డ్రోన్ల సాంకేతికత గేమ్ ఛేంజర్ -రాబోయే కాలంలో సమాచారమే విలువైన సంపద: చంద్రబాబు
డ్రోన్ సమాచార విశ్లేషణకు భవిష్యత్తు
పట్టణాల్లో భవన నిర్మాణ ప్రాంతాలకు డ్రోన్లు పంపడంతోపాటు వాటి ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే విధానానికి భవిష్యత్తు ఉందని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మైనింగ్, ఇసుక తవ్వకాలు, గనుల్లో ఖనిజాల లభ్యత వంటి గణాంకాలు సహితంగా తెలిపే డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి తేవాలన్నారు. పంట కాలువల్లో ఎంతమేర పూడిక తొలగించారో కూడా డ్రోన్ల ద్వారా తెలుసుకునే వ్యవస్థ అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో డ్రోన్ల తయారీకి ముందుకు రావాలని పలు సంస్థలను కోరారు.
- గుంపులుగా చేరిన జనాలను డ్రోన్ల ద్వారా చిత్రీకరించడంతోపాటు ప్రజలతో కలిసి ఉన్న రౌడీలను గుర్తించడం కూడా అంతే అవసరమన్నారు. అలాంటి టెక్నాలజీ ఉంటే వినియోగించుకోవడంతోపాటు ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
- పంటల్లో తెగుళ్ల గుర్తింపు, వాటి నివారణకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసే ఇంటిగ్రేటెడ్ డ్రోన్ టెక్నాలజీని రాష్ట్రంలో వినియోగించుకునేలా చూస్తామన్నారు.
- రహదారుల్లో గుంతలు, వాటి పరిమాణం కూడా గుర్తించే డ్రోన్ టెక్నాలజీ రూపొందిస్తే పనులకు సులువుగా అంచనాలు వేయొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.
- గుంటూరు జిల్లాలో కృష్ణా నది మధ్యలో కొల్లిపర మండలంలో ఉన్న ఇళ్లకు డ్రోన్ల ద్వారా ఇటీవల ఔషధాలు పంపిణీ చేసిన విషయం ప్రస్తావనకు వచ్చింది.
- కాలువల్లో గుర్రపుడెక్కను తొలగించేందుకు రూపొందించిన టెక్నాలజీని రాష్ట్రంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువులు, మురుగుకాలువల్లో దోమలు, వాటి లార్వాలను గుర్తించే డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు.
భవిష్యత్తును మార్చబోతున్న డ్రోన్లు :రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు చూడబోతున్నామని సీఎం తెలిపారు. 25 ఏళ్ల క్రితం తాను ఐటీని ప్రమోట్ చేసినపుడు చాలా మందికి అర్థం కాలేదని, దాన్ని ఉపయోగించుకున్నవారు వృత్తిపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎదిగారని తెలిపారు. భవిష్యత్తు అభివృద్ధికి డేటా ఇంధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. డ్రోన్ ద్వారా ఆసుపత్రులకు మందుల పంపిణీ నుంచి భూ సర్వే, ఎరువులు, విత్తనాలు వేసే వరకు ఉపయోగిస్తున్నాంమని పేర్కొన్నారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు పొందగలుగుతున్నామని, భవిష్యత్తును డ్రోన్లు మార్చబోతున్నాయని, నాలెడ్జ్ ఎకానమీపై భవిష్యత్తు ముడిపడి ఉందని అన్నారు. వీటిని అనుసంధానించుకోగలిగితే ప్రపంచానికే భారత్ నాలెడ్జ్ హబ్‌గా తయారవుతుందని తెలిపారు.
ఆకాశంలో అద్భుతం - అమరావతిలో డ్రోన్‌షో అదుర్స్