AP CM Chandrababu in Handloom Day Celebrations :జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో నేతన్నలు స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి, చేనేత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి కోసం వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలు కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. చేనేతకారులకు ఇచ్చే అన్ని రుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగోసారి సీఎం అయ్యాక మొదట కలిసింది చేనేత కార్మికులనేనన్న చంద్రబాబు సహకార సంఘాల నేతలు సమర్థవంతమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ :ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోనూ చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో చేనేత సంఘాల నాయకులు కూడా సరికొత్తగా ఆలోచించాలన్నారు. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యతని, ప్రజలంతా నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపు నిచ్చారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.