CM Chandrababu Congrats to Balakrishna: కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారం పొందిన తెలుగు సినీ దిగ్గజం మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు మరియు దాతృత్వంలో రాణించారన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకితభావాన్ని లెక్కలేనన్ని జీవితాలను తాకిందని మరియు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. ఇది నిజమైన ఐకాన్ మరియు దయగల నాయకుడికి దక్కిన గౌరవమని చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ సినీ రంగంలో అడుగుపెట్టారు. 30 ఏళ్లుగా సినీ రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. 1960 జూన్ 10న నందమూరి బాలకృష్ణ జన్మించారు. ఎన్టీఆర్, బసవ రామతారకం దంపతుల ఆరో కుమారుడు బాలకృష్ణ. నటుడిగా, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ సేవలందిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు.
తాతమ్మ కల(1974) చిత్రంతో బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి బాలకృష్ణ నటించారు. 'సాహసమే జీవితం' చిత్రంతో హీరోగా బాలకృష్ణ పరిచయమయ్యారు. ఇప్పటి వరకు బాలకృష్ణ 109 చిత్రాల్లో నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో బాలకృష్ణ ఇప్పటికీ అలరిస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బాలయ్య మావయ్యకు అభినందనలు: పద్మభూషణ్‌కు ఎంపికైన బాలకృష్ణకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. బాలయ్య మావయ్యకు పురస్కారం రావడం తమ కుటుంబానికి చాలా గర్వకారణమని లోకేశ్ పేర్కొన్నారు. బాలకృష్ణ ప్రయాణం లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సినీ, రాజకీయాల్లో బాలకృష్ణ కృషికి ఈ పురస్కారం నిదర్శనమన్నారు. బాలకృష్ణ విజయాలకు గుర్తింపురావడం సంతోషంగా ఉందని లోకేశ్ ట్వీట్ చేశారు.