Tirupati Laddu Issue in AP Updates :తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం స్పందించిన చంద్రబాబు దీనిపై నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
టీటీడీ అత్యవసర సమావేశం :ఈ నేపథ్యంలోనే శనివారం లడ్డూ అపవిత్రంపై టీటీడీ ఈవో శ్యామలరావు అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, అర్చకులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రం నేపథ్యంలో సంప్రోక్షణపై చర్చించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొలిక్కిరాని నిర్ణయం: అయితే తిరుమల లడ్డూ అపచారం పరిష్కృతిపై ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అపచార పరిహారం చేసేందుకు ఆగమ కమిటీ పలు సూచనలు చేసింది. చర్చల్లో సంప్రోక్షణ యాగం నిర్వహణలపై ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో ఆదివారం మరోసారి ఆగమ సలహాదారులు, అర్చకులతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. భక్తుల దర్శనాలతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో నిర్ణయంపై ఆలస్యం అవుతోంది.