TRIBUTE TO POTTI SRIRAMULU: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు సేవలు నిరుపమానమని, ఆయనను భావితరాలు గుర్తించుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు సామాజికవాది, మానవతావాదిగా చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేయకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రం ఇస్తే బాగుండేదని చెప్పారు. పొట్టి శ్రీరాములు సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా మారుస్తామని చెప్పారు.
అమరజీవి, ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాల్నే పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంతోపాటు, సర్దార్ వల్లభాయ్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కొద్దిమంది మాత్రమే జాతి కోసం ఆలోచిస్తారని, అలాంటివారు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఒకపూట తినకపోతే ఇబ్బంది పడతామని, అలాంటిది 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. శ్రీరాములు పాడె మోయడానికి ఎవరూరాని దయనీయ పరిస్థితి ఏర్పడిందని, టంగుటూరు ప్రకాశం పంతులు, ఘంటశాల వంటివారు ముందుకు వచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో చివరకు 11 జిల్లాలతో రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా హైదరాబాద్లో తెలుగు యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని చంద్రబాబు చెప్పారు.
సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన - ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ ప్రకటన
పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ:టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాకు తామే పొట్టి శ్రీరాములు పేరు పెట్టామని చంద్రబాబు చెప్పారు. పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలోనూ త్వరలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రాష్ట్రాన్ని ప్రగతిబాటలో పయనింపజేస్తున్నామని 2047 స్వర్ణాంధ్ర విజన్ ఇందుకు ఉదాహరణగా చెప్పారు. కొంతమంది నాయకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, విభజన కంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు విమర్శించారు.