Collectors Conference: గడచిన ఆరు నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణించామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్ నిర్మాణంలో జిల్లా కలెక్టర్‌ల బాధ్యత చాలా ఉందన్నారు. కలెక్టర్‌ల సదస్సు రెండో రోజు ముగింపులో సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెర్స్ ఉండాలని, ప్రజల్లో సానుకూల దృక్పథం కల్పించేలా పాలన సాగించాలని సూచించారు. ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే అంతిమ లక్ష్యమని తేల్చి చెప్పారు.
రాష్ట్రం ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని, గడిచిన ఆరు నెలల్లో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొందని CM చంద్రబాబు అన్నారు. రాష్ట్రం పునర్నిర్మాణంలో కలెక్టర్ లు, ఉద్యోగుల పాత్ర కీలకమన్న ఆయన, ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఉండాలన్నారు.జిల్లా కలెక్టర్ ల సదస్సు రెండో రోజున ముగింపు ప్రసంగంలో సీఎం వివిధ విషయాలపై దిశానిర్దేశం చేశారు. సమస్యలతో ప్రజలు కార్యాలయాలకు వస్తున్నారంటే ఎక్కడో పరిపాలనలో లోపాలు ఉన్నాయని సంకేతంగా భావించాలని సూచించారు. సవాళ్లను అవకాశాలుగా మలచుకొని ముందుకు సాగాలన్నారు.
ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కారం కావాలి: ఆర్థికేతర సమస్యల్ని సత్వరం పరిష్కారం చేయాలని, ఒక వేళ పరిష్కారం కాకపోతే ఎందుకు అవ్వలేదో రికార్డులో పెట్టాలన్నారు. ప్రభుత్వానికి గుక్క తిప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆత్మస్థైర్యం ఉందని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్‌లో కొన్ని అమలు చేశామని ఇంకా కొన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. విధుల్లో వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు.