CM Chandrababu Babu Review Meeting : రాష్ట్రంలోని దర్యాప్తు, విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమావేశమయ్యారు. ఫైబర్ నెట్ కేసు సహా వివిధ కేసుల్లోని విచారణ, దర్యాప్తు వ్యవహారంపై ఆయా దర్యాప్తు సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉందన్న అంశాలను సీఎం అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో సీఎస్, డీజీపీ సహా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
గత ప్రభుత్వ హయాంలో అవినీతి వ్యవహారాలకు సంబంధించిన వివిధ కేసుల దర్యాప్తు పురోగతి సహా రాష్ట్రంలోని శాంతిభధ్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ సహా ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్హాతో సీఎం భేటీ అయ్యారు. మద్యం, గనులు, ఫైబర్ నెట్, భూ కబ్జాలు, మదనపల్లె ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చించారు.
సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన - ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ
ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాల వ్యవహారం సహా గనుల శాఖలో ఇసుక తవ్వకాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించేయటం వంటి అంశాలపైనా సీఎం అధికారులతో చర్చించారు. గనుల అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు మద్యం కుంభకోణంలోనూ విచారణ జరుగుతోందని సీఐడీ అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సహా మరికొందరు ఈ అక్రమాల వెనుక ఉన్నారని వాటిని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు మదనపల్లెలో రెవెన్యూ కార్యాలయంలో ఫైళ్లు తగులబెట్టిన ఘటన దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని సీఎం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుకు తెచ్చేలా విచారణ, దర్యాప్తు పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో వేర్వేరు కేసుల్లో వేగంగా దర్యాప్తు ముగించి కోర్టుల్లోనూ విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.
'దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి రండి' - సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
వరద బాధితుల ఖాతాల్లో రూ.569 కోట్లు జమ- అకౌంట్లు లేనివారికి ఇలా! - CM Chandrababu Thanks to Officers