Chandrababu Approve Pending Bills :సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో ఆయన చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్నస్థాయి పనులు చేసి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. సమీక్ష అనంతరం పలు పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు చంద్రబాబు ఆమోదించారు.
వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ.6700 కోట్ల నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు ఈ మొత్తం బకాయిలు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు జీపీఎఫ్ కింద రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు చెల్లించనున్నట్లు పయ్యావుల కేశవ్ వివరించారు. సీపీఎస్ కు సంబంధించిన రూ.300 కోట్లు, టీడీఎస్ కింద రూ.265 కోట్లు చెల్లించనున్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉద్యోగులకు మొత్తంగా రూ.1300 కోట్లు విడుదల చేస్తున్నామని వివరించారు. ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను రూ.788 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. చిరు కాంట్రాక్టర్లు రూ.10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26,000ల మందికి లబ్ధి చేకూరేలా రూ.586 కోట్లు విడుదల చేశామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.