ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడ్​న్యూస్ - వారందరికీ జీతంతో పాటు 4 వేల రూపాయలు అదనం - CHANDRABABU REVIEW HEALTH DEPT

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష - 108 వాహన డ్రైవర్లు, సిబ్బందికి జీతంతో పాటు అదనంగా 4 వేల రూపాయలు

Chandrababu
Chandrababu (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2024, 7:32 AM IST

Chandrababu Review Health Department : వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డ్ ఇచ్చే విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని చంద్రబాబు పేర్కొన్నారు.

వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, 108,104 సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్యసేవలు అందించే విషయంపైనా అధికారులతో సీఎం చర్చించారు. గత టీడీపీ హయాంలో 108, 104 సర్వీసులకు విడివిడిగా ఆపరేటర్లు ఉండేవారని 2020 తర్వాత కాల్ సెంటర్‌తో కలిపి ముగ్గురు ఆపరేటర్ల ద్వారా సేవలు అందించారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం నేడు మళ్లీ కొత్తగా టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో సింగిల్ ఆపరేటర్ ద్వారా మూడు సేవలు చేపట్టాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న 190 అంబులెన్స్‌లు ఫిట్‌నెస్ కోల్పోయాయని 2016లో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇందులో 54 వాహనాలు 5 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగి ఉండగా, 65 వాహనాలు 4 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. 71 వాహనాలు 2.5 నుంచి 4 లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయి. అన్నింటినీ పూర్తిగా మార్చి కొత్తవాహనాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. వీటి కోసం రూ.60 కోట్లు ఖర్చు అవుతుంది.

Chandrababu on Health Department : 104 సర్వీసుల్లో గతంలో ల్యాబ్ టెక్నిషియన్ ఉండేవారు. మైక్రోస్కోప్, స్క్రీనింగ్ పరీక్షలు చేసేవాళ్లు. రాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అందుబాటులో ఉండేవి. గత ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసింది. గ్రామాల్లో వైద్య సేవలు అందించడంలో కీలకమైన 104 అంబులెన్స్‌లను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నిషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురానున్నారు.

108 సర్వీసులో సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారని వీరికి జీతంతో కలిపి అదనంగా రూ.4000లు చెల్లించేవారు. అయితే గత ప్రభుత్వం రూ.2000లు మాత్రమే ఇచ్చింది. దీన్ని తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా రూ.4000లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య పెంచాల్సి ఉందని అధికారులు తెలపగా ముఖ్యమంత్రి దానికి కూడా అంగీకరించారు. ఇందులో భాగంగా 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. దీనికి ఏడాదికి రూ.9.45 కోట్లు అదనంగా ఖర్చు అవనుంది.

ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఆత్మీయులను కోల్పోయి బాధల్లో ఉన్న ప్రజలను పీల్చుకుతినే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.30 కోట్లమందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలో 3257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని వారు పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజన :ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ ఉంటుందని ట్రస్ట్ పద్దతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభిచనున్నారు.

పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్న బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ లబ్ధిదారులందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను కూడా పరిశీలించి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. జన్ ఔషధి మందుల షాపులను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ యాప్​లో పేషంట్ పూర్తి వివరాలుండాలి- వైద్య సమీక్షలో సీఎం చంద్రబాబు - Chandrababu Review on Health Dept

గర్భిణులపై ప్రత్యేక దృష్టి - 154 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన వైద్య ఆరోగ్య శాఖ - Special Focus on pregnant women

ABOUT THE AUTHOR

...view details