Prakash Raj tweet on Tirupati Laddu Issue : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను జోడిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలున్న పోస్టును షేర్ చేశారు. ఆ ఫొటో కింద దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించారు.
దీంతో మరోసారి ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వివాదానికి సంబంధించి ప్రకాశ్ రాజ్ ఇటీవల చేసిన కామెంట్స్‌పై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ నాయకులు, మూవీ ఆర్టిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి ప్రకాశ్‌రాజ్ లడ్డూ వివాదంపై స్పందిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇది జరిగింది :తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీనియర్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముందుగా పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ఓ పోస్టు చేశారు."మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు) అంటూ ఓ పోస్టు చేశారు.