CID Chargesheet on AP Skill development Case :ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదు చేసిన కేసులో గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో అభియోగపత్రం(ఛార్జిషీట్) దాఖలు చేసింది. ప్రజాప్రతినిధులపై దాఖలు చేసే ఛార్జిషీట్‌ను న్యాయస్థానం విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవాలంటే (కాగ్నిజెన్స్) కాంపీటెంట్ అథార్టీ నుంచి (ప్రస్తుత కేసులో గవర్నర్ నుంచి) అనుమతి తప్పనిసరని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్ని విస్మరించి సీఐడీ అభియోగపత్రం దాఖలు చేయడం న్యాయవర్గాల్లో చర్చాంశనీయమైంది. గవర్నర్ అనుమతి లేనందున ఛార్జిషీట్‌ను కోర్టు రిటర్న్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు- అసైన్డ్ భూముల కేసులో ఛార్జిషీట్
Chargesheet on Chandrababu Naidu :స్కిల్ కేసులో మొత్తం 41 మందిని సీఐడీ నిందితులుగా పేర్కొంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఏపీఎస్‌ఎస్‌డీసీ (ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ) అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఎపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మినారాయణ, సీమెన్స్, డిజైన్ టెక్, పీవీఎస్‌పీ స్కిలర్ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా పేర్కొంది. ఈ అభియోగపత్రం వ్యవహారంపై ఏసీబీ కోర్టు న్యాయాధికారి చెక్ అండ్ పుటప్ అని రాసి ఏఓ పరిశీలనకు పంపారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగంలో నిందితుల పాత్ర ఉందని సీఐడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. కుట్రలో భాగంగా సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు రూ.371 కోట్లు మళ్లించారని ఆరోపించింది.