Chandrababu on Green Energy : రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను పూడిమాడకకు తెచ్చి వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని వివరించారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. తద్వారా ఎగుమతులు పెరిగి మనకి లాభం వస్తుందని పేర్కొన్నారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని సీఎం తెలియజేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
'ఎన్టీపీసీలో బొగ్గు మండించడం ద్వారా వచ్చే కార్బన్ డై ఆక్సైడ్‌ను పూడిమడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తికి వాడితే కాలుష్యం తగ్గుతుంది. గ్రీన్ కో కంపెనీ కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టెకోవర్ చేసి గ్రీన్ ఆమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ప్లాంట్ మీద రూ.25,000ల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయి. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్సెడ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలను పెడుతోంది. ఒక్కో కేంద్రంపై రూ.130 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. బయోగ్యాస్‌కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుంది. ఈ గడ్డిని పెంచేందుకు ఎకరాకు రూ.30,000లు కౌలు రైతులకు రిలయన్స్ చెల్లిస్తుంది. ఈ కేంద్రాల వల్ల ఉద్యోగాలు వచ్చి, గ్యాస్ ఉత్పత్తిలో వచ్చే వ్యర్ధాలు భూసారం పెంచేందుకు ఎరువుగానూ ఉపయోగపడతాయని' చంద్రబాబు వెల్లడించారు.
కొత్త ఆలోచనలు చేస్తున్నాం : బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీలు మోడల్ని కుప్పంకి తెచ్చిందని చంద్రబాబు తెలిపారు. కుప్పంలో సూర్యఘర్ అమల్లో ఉన్న ఇళ్లకు స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ఇంటి యజమానికి డబ్బులు చెల్లిస్తుందన్నారు. ఇది కుప్పం సూర్యఘర్ ఇంటి వాసులకు అదనపు ఆదాయం కానుందని వెల్లడించారు. అదేవిధంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా వీటిని అందిచేందుకు కేంద్ర రాయితీ పోను మిగిలిన ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకూ కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటామని చెప్పారు. సర్కార్ పెట్టుబడి తిరిగి వచ్చాక యూనిట్ మొత్తం ఇంటి యజమానికి అప్పగిస్తామని తెలిపారు.
Chandrababu Chit Chat 2025 : మరోవైపు పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని మార్కెట్ చేసేందుకు దావోస్ పర్యటన ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రపంచస్థాయి సంస్థలతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన దగ్గర ఉన్న అవకాశాలను అందరికి తెలిసేలా చేయవచ్చని తెలిపారు. తద్వారా పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందన్నారు. గ్రీన్ఎనర్జీ, బయో ఫ్యూయల్స్ రంగంలో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో 5000ల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, స్వాపింగ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ విధానం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. కుటుంబాన్ని, ఇంటిని యూనిట్‌గా తీసుకుని ప్రజలకు సంబంధించిన డాటా ద్వారా వారికి నేరుగా సంక్షేమ కార్యక్రమాలు, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. ప్రతి కుటుంబ ఆర్థిక, ఆరోగ్య, సామాజిక పరిస్థితులు అధ్యయనం చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
'ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసి ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు యూనిట్‌గా కార్యక్రమాలు చేపడతాం. డ్రోన్, ఏఐ, ఐఓటీ, సీసీ కెమెరాలు, అధార్ వంటి వాటి ద్వారా ప్రభుత్వ సేవల్లో, ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాం. ఆర్గానిక్ ఉత్పత్తులను ఏ పొలంలో పండిచారో ఓ ఫొటో ద్వారా తెలుసుకునే టెక్నాలజీని ఓ సంస్థ తెచ్చింది. అది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల రాష్ట్రంలో పండే ఉత్పత్తుల ఎగుమతులకు డిమాండ్ పెరిగి పెద్ద కంపెనీలు ముందుకు వస్తాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న ఆర్గానిక్ సర్టిఫైడ్ భూముల్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తాం. ప్రజల సమాచారాన్ని రియల్ టైంలో మానిటరింగ్, అనాలసిస్ చేయడం ద్వారా పాలన మెరుగవుతుంది. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తమ విధానం' అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం : మరోవైపు కుప్పంలో కొంతమందికి మానసిక ఎదుగుదల సమస్యలు, వినికిడి, మాటలు రాని సమస్యలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలోనే వారిలో సృజనాత్మకతను పెంచడానికి యాప్‌ల సాయంతో శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ఇది సత్ఫలితాలు ఇస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా దీనిని అందుబాటులోకి తెస్తామని సీఎం వెల్లడించారు.
అవసరమైతే ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను తీసుకోండి- సీఎం చంద్రబాబు సూచన
అందుకే నేను ప్రతీ సంక్రాంతికి మా ఊరికి వెళ్తున్నా: సీఎం చంద్రబాబు