Diabetes Patients can Eat Mutton : నేటి ఆధునిక కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే ఇక జీవితమంతా మెడిసిన్ వేసుకుంటూ ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగి కిడ్నీ, గుండె జబ్బులు వంటి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, షుగర్ ఉన్నవారు మటన్ తినచ్చా లేదా ? అనే డౌట్ తరచూ వస్తుంది. ఈ ప్రశ్నకు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి సమాధానం ఇస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.
నాన్‌వెజ్ అంటే ముందుగా మనందరికీ చికెన్ గుర్తుకువస్తుంది. ఆ తర్వాతి స్థానంలో మటన్ తప్పకుండా ఉంటుంది. నార్మల్‌గా చాలా మంది సండే రోజు చికెన్, మటన్ ఇలా ఏదోకటి వండుకుని తింటుంటారు. ఇక పండగలప్పుడు నాన్‌వెజ్ తప్పనిసరిగా తినాల్సిందే. అయితే, మటన్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి చెబుతున్నారు. షుగర్‌తో బాధపడే వారు మటన్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.
"షుగర్‌తో బాధపడేవారు ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్ చాలా అవసరం. ప్రొటీన్ ఎక్కువగా ఉండే చికెన్, చేపలు, పప్పు ధాన్యాలు, ఎగ్‌వైట్ వంటి వాటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. చికెన్‌లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి, మధుమేహ బాధితులు చికెన్ తినచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్యా ఉండదు." -డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి
ఇలా వండండి:
నాన్‌వెజ్ వంటలు వండేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే, సాధారణంగా ఎక్కువ మంది మాంసాహార వంటల్లో నూనె ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే బిర్యానీ, వేపుడు లాంటి రెసిపీల్లో నూనె/నెయ్యి అధికంగా వాడుతుంటారు. ఇలా నూనెలు ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటాయని భావిస్తారు. కానీ, ఇలా ఆయిల్ ఎక్కువగా వేసి వండిన చికెన్ తినడం వల్ల షుగర్ ఉన్నవారికి భవిష్యత్తులో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఉప్పు, నూనె తక్కువగా వేసి చికెన్ ఉడకబెట్టుకుని తినాలని డాక్టర్ రవిశంకర్ సూచిస్తున్నారు. మధుమేహులు చేపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగవని అంటున్నారు. చేపలను నూనెలో ఫ్రై చేసుకోకుండా పులుసు, కూర వండుకుని తినాలని చెబుతున్నారు.
మటన్ వద్దు!
మటన్ అంటే దాదాపు అందరికీ ఇష్టమే. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా మటన్ కర్రీ తింటారు. అయితే, మధుమేహం ఉన్నవారు మటన్ తినకూడదని డాక్టర్ రవిశంకర్ చెబుతున్నారు. రెడ్‌మీట్ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి, సరైన విధంగా చికెన్, చేపలు వండుకుని తినాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్ బాధితులకు సూపర్ న్యూస్ - ఈ స్నాక్స్ తింటే కంట్రోల్ అవుతుందట!