Roads constructions in Krishna District: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని రహదారులన్నీ నరకదారుల్లా మారాయి. అడుగుకో గుంత గజానికో గొయ్యితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి సర్కార్ గద్దెనెక్కగానే రోడ్లపై దృష్టి సారించింది. కొత్త రోడ్లు ఇప్పటికిప్పుడు నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి మరమ్మతులు చేయాలని నిర్ణయించింది.
హడావుడిగా జరుగుతున్న ఈ పనుల్లో నాణ్యతలపై అనుమానాలు లేకుండా ఉండాలని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల పెనమలూరు నియోజకవర్గం గొడవర్రు, రొయ్యూరు రోడ్డు నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రుపాయి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ దుర్వినియోగం కాకుడదని ఆయన అధికారులకు సూచించారు.
కృష్ణా జిల్లాలో పల్లె పండుగ కింద 162.94 కోట్ల రూపాయలతో 2040 పనులకు పూర్తి చేయాలని సంకల్పించింది. మొదటి దశలో జిల్లాలో 140 కోట్లతో 1933 సిమెంట్ రోడ్లు 222 కిలోమీటర్లు, 9.19 కోట్లతో 33 బీటీ రోడ్లు 31.82 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయించింది. ప్రహరీ గోడల నిర్మాణం, శ్మశాన వాటికలు, వివిధ అభివృద్ధి పనులు కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు 1530 పనులు పూర్తవగా మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయి.
Penamalur Constituency: పెనమలూరు నియోజకవర్గంలో 393 పనులకు 53 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వీటిలో 21 కోట్లు తాడిగడప మున్సిపాలిటీకి, ఉయ్యూరు మున్సిపాలిటీకి 20 కోట్లు, పెనమలూరు మండలానికి 8 కోట్లు, కంకిపాడు మండలానికి 10 కోట్లు, ఉయ్యూరు మండలానికి 6 కోట్లు నిధులను కేటాయించారు. 15 రహదారులు భవనాలు శాఖ పనులకు 6 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉప్పలూరు- మద్దూరు రహదారి అభివృద్ధి పనులు, కంకిపాడు- రొయ్యూరు ప్రధాన రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
Pamarru Constituency: పామర్రు నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులకు మొదటి విడతలో అయ్యంకి నుంచి కూచిపూడి వరకు 7 కిలోమీటర్లకు 3 కోట్ల 20 లక్షల విలువైన పని కోసం అనుమతులకు పంపగా కోటీ 20 లక్షలకు మాత్రమే ఆమోదం లభించింది. ఈ పనులు ఇప్పుడే మొదలు పెట్టారు. ఇంకా నియోజకవర్గంలోని పెదపారుపూడి మండలం, పామర్రు, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లోని రోడ్ల మరమ్మతులకు మూడో విడత ప్రాధాన్యంగా అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. పామర్రు నియోజకవర్గంలో కొన్ని టెండర్ల దశలో ఉంటే మరికొన్ని పనులు సాగుతున్నాయి.
మూడు భాషల్లో ఇష్టమైన పుస్తకాలు కొన్న పవన్ - 2 గంటలపాటు స్టాళ్లు ఓపెన్
Machilipatnam Constituency: మచిలీపట్నం నియోజకవర్గంలో 5 రహదారుల నిర్మాణానికి 1 కోటీ 70 లక్షలు మంజూరయ్యాయి. మచిలీపట్నం - తాళ్లపాలెం రోడ్డుకి 20 లక్షలు, తాళ్లపాలెం -నారాయణపురం రోడ్డుకి 30 లక్షలు కేటాయించి పనులు పూర్తి చేశారు. మాజేరు - చినయాదర రోడ్డు కోసం 40 లక్షలు, మచిలీపట్నం - గుండెపాలెం రోడ్డుకి 40 లక్షలు, మచిలీపట్నం - కోన రోడ్డుకి 40 లక్షలు కేటాయించి గుంతలు పుడ్చారు. రెండో విడతలో 8 రహదారుల నిర్మాణానికి 2.60 కోట్లను ప్రభుత్వం మంజురు చేసింది. మచిలీపట్నం - కొన రోడ్డుకి 40లక్షలు, మచిలీపట్నం - చిన్నాపురం రోడ్డుకి 40లక్షలు కేటాయించారు.
కోనేరు సెంటర్ నుంచి పోర్టు రోడ్డుకి 40లక్షలు కేటాయించగా ప్రస్తుతం అవి టెండర్ల దశలో ఉన్నాయి. కలెక్టర్ బంగ్లా - చిలకలపూడి రైల్వేస్టేషన్ - జడ్పీ సెంటర్ రోడ్డుకి 40లక్షలు, నేషనల్ కాలేజ్ నుంచి ఆకుమర్రు లాకు రోడ్డుకి 30లక్షలు, మూడు స్థంభాల సెంటర్ నుంచి లక్ష్మీటాకీస్ రోడ్డుకి 10 లక్షలు కేటాయించారు. మచిలీపట్నం నుంచి పోతేపల్లి, పొట్లపాలెం రోడ్డుకి 40లక్షలు, మాచవరం మెట్టు నుంచి పిల్లల గొల్లపాలెం రోడ్డుకి 20లక్షలు కేటాయించారు.
Gannavaram Constituency: గన్నవరం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మత్తులకు 16.15 కోట్లు మంజూరయ్యాయి. 73 పనులకు టెండర్లు వేశారు. అరకొర మినహా అన్ని వర్కులు జరుగుతున్నాయి. గన్నవరం మండలంలో 15 సీసీ రోడ్లకు గాను 4.50కోట్లు, ఉంగుటూరు మండలంలో 10 రోడ్లకు గాను 3 కోట్లు, బాపులపాడు మండలంలో 35 రోడ్లకు గాను 5.25కోట్లు, విజయవాడ రూరల్ మండలంలో 13 వర్కులకు 3.40కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏలూరు, కృష్ణా జిల్లాలను, గుడివాడ, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారులను నిర్మిస్తున్నారు.
Pedana Constituency: పెడన నియోజకవర్గంలో 40 కి పైగా రోడ్లు మరమ్మతుల కోసం గుర్తించగా వాటిల్లో 14 రోడ్లకు అధికారులు 2 కోట్ల 60 లక్షల 75 వేల రూపాయల పనులకు టెండర్లు పిలవగా ఒక పని పూర్తయింది. కృత్తివెన్ను మండలంలో ఒక పని మాత్రమే మొదలుపెట్టారు, ఇంకా 12 పనులు మొదలు పెట్టలేదు, మిగిలిన 30 రోడ్లుకి కూడా ప్రతిపాదించారు.
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ - కిటకిటలాడుతున్న టోల్‌గేట్లు
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - ఈ కొత్త హైవే ఎక్కేయండి, ఎంతో సమయం ఆదా