Christmas Celebrations 2024 : రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 12 గంటలకు పలు కార్యక్రమాలు, సామూహిక ప్రార్ధనలు చేపట్టారు. ప్రత్యేక ప్రార్ధనలతో రోజుని ప్రారంభించనున్నారు. పండగ వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు యేసు నామస్మరణతో మార్మోగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రీస్తు పుట్టిన రోజు వేడుకలు : రాష్ట్రవ్యాప్తంగా క్రీస్తు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంబర చుంబిత ఆకాశహార్మ్యంగా కీర్తించబడే అద్భుత కట్టడమైన మెదక్ చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు మిన్నంటాయి. తెల్లవారుజామున ప్రాతఃకాల ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శతాబ్ది వేడుకల సందర్భంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాలతో చర్చి ప్రాకారాలను, టవర్‌ను ముస్తాబు చేశారు. చిన్నపిల్లలను ఆహ్లాదపరిచేలా చర్చి ఆవరణలో రంగులరాట్నాన్ని ఏర్పాటు చేశారు.
హనుమకొండ జిల్లాలోని కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్ధనా మందిరం ప్రార్థనలతో మార్మోగింది. ముప్పై ఏళ్ల క్రితం ఓ చిన్న పాకలో ప్రార్ధనలతో మెుదలైన ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించింది. నేడు ఆసియాలోనే అతి పెద్ద చర్చిగా అవతరించింది. ఇక్కడ ఒకేసారి 40 వేల మందికి పైగా ప్రార్ధనలు చేసుకునే సదుపాయాలు ఉన్నాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విద్యుద్దీప కాంతులతో చర్చి పరిసరాలు ధగధగలాడాయి. క్రీస్తు ఆరాధనలు, పాటలు, దేవుని వాక్యాల ఆలాపనలతో ఈ ప్రార్ధనా మందిరం మార్మోగింది.
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం: క్రైస్తవులకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యేసు ప్రభువు ఆదర్శాలను గౌరవించడానికి క్రిస్మస్ సంతోషకరమైన సందర్భమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.