Chittoor District MLAs on Tirumala Laddu: తక్కువ ధరకు వస్తే చాలా! నాణ్యత చూడరా! అని చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్ పాల్గొన్నారు. చేసిన తప్పు సమర్థించుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. అన్నీ పరిశోధనలు చేస్తున్నామని, సాక్ష్యాలు సేకరించి ల్యాబ్‌కు పంపించామన్నారు.
వైఎస్సార్సీపీ నేతలు చేసిన తప్పును ఒప్పుకోవాలని అన్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసే ఎవరినీ ఉపేక్షించేది లేదని చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటం చాలా బాధాకరమని, ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తిస్థాయి పరీక్షల అనంతరమే కల్తీపై అధికారులు నిర్ధరణకు వచ్చారన్నారు. విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
తిరుమల ఆలయంలో చట్టం కన్నా ధర్మం ముఖ్యమని, ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా శ్రీవారి కార్యక్రమాలు సాగుతాయని చెప్పారు. శ్రీవారి లడ్డూను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారని, ల్యాబ్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటుంటే రాజకీయం ఆపాదిస్తారా అని మండిపడ్డారు. తప్పు జరగలేదనే నమ్మకం ఉంటే విచారణను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.