Peddireddy Land Grabbing Report :చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీమంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఈటీవీ భారత్-ఈనాడు సంచలనాత్మక కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులెన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి చెరబట్టినట్లు భావిస్తున్న 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు.
ప్రధాన కమిషనర్‌కి కలెక్టర్ నివేదిక :పులిచెర్ల తహశీల్దార్‌ను హుటాహుటిన చిత్తూరు కలెక్టరేట్‌కు పిలిపించారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్త్రాలను తెప్పించుకున్నారు. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్‌ల్యాండ్ అడంగల్‌లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు నివేదిక సమర్పించారు.
అందులో మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన ఫెయిర్ అడంగల్ రిజిస్టర్ ప్రకారం 295 సర్వే నంబర్లో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబర్లో 6 ఎకరాలు ఉంది. ఆ మొత్తం భూమికి చల్లా కుప్పుస్వామయ్య పేరు మీద పట్టా ఉంది. ఎఫ్‌ఎంబీలో కూడా ఆ సర్వే నంబర్లలో అంతే భూమి ఉంది. సబ్ డివిజన్లు జరగలేదు. టెన్ వన్ రికార్డు ప్రకారం చూసినా భూమి విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదు. మాన్యువల్ రికార్డ్ ఆఫ్ రైట్ -1కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. దాని ప్రకారం 295 సర్వే నంబర్లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరుమీద 47.69 ఎకరాలు నమోదు చేశారు. మళ్లీ దానికి వృత్తం చుట్టి 37.69 ఎకరాలు అని రాశారు.