గరుడ ప్రసాదం' రద్దీ ఎఫెక్ట్ Vivaha Prapti Program Cancel in Chilkur Temple :రంగారెడ్డి జిల్లా శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన కల్యాణోత్సవంలోని ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంగరాజన్ వెల్లడించారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు, తమ ఇళ్లలోనే దేవుడిని ప్రార్థించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆదివారం సాయంత్రం నిర్వహించాల్సిన కల్యాణోత్సవం యధావిధిగా జరుగుతుందన్నారు.
"రేపు చిలుకూరు బాలాజీ కల్యాణోత్సవం నిర్వహిస్తాము. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరికీ సంతాన ప్రాప్తి కలగాలని, వివాహం ఆలస్యమైన వాళ్లకు పెళ్లి జరగాలని గరుడ ప్రసాదం కోసం నిన్న, వివాహ ప్రాప్తి కోసం రేపు భక్తులంతా వేడుకల్లో పాల్గొనాలని కోరాము. అయితే శుక్రవారం భక్తుల తాకిడిని చూసిన తర్వాత, వారు పడిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని రేపటి వివాహ ప్రాప్తిని రద్దు చేయటం జరిగింది. పెళ్లి కాని వారు ఇళ్లలో నుంచే దేవుడిని ప్రార్థించండి." - రంగరాజన్, బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు
Chilkur Balaji Temple Traffic Issue :హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన గరుడ ప్రసాద వితరణ భక్తులు, సామాన్యులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. ప్రసాద వితరణ ప్రదేశం వద్ద తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 50 మందికి పైగా భక్తులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పోలీసులు వారిని అతి కష్టం మీద బయటకు తెచ్చి, అంతేకష్టంగా అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించారు.
సంతాన ప్రాప్తి లేని మహిళలకు గరుడ ప్రసాద వితరణచేస్తారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంతో వేకువజామున 4 గంటల నుంచే వేల సంఖ్యలో భక్తులు సొంత వాహనాలతో తరలిరావడం, నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. కిలోమీటరు దూరం ప్రయాణానికి 2 గంటల సమయం పట్టటంతో సుమారు 30 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. వాహనాల రద్దీతో ఎండలోనే భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయంలో తాబేలు.. దేనికి సంకేతం?
గరుడ ప్రసాదం - పోటెత్తిన భక్తజనం : ప్రసాద పంపిణీ పూర్తి కావొస్తుండటంతో తమకు దొరుకుతుందో లేదో అని వందల మంది భక్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయగా, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రసాదం కేవలం 10 వేల మందికి సరిపోయేంత మాత్రమే ఉండగా, ఉదయం 10 గంటలకే 70 వేల మందికి పైగా భక్తజనం లైన్లలో నిల్చున్నారు. దీంతో మళ్లీ ప్రసాదం చేయించి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారుగా 35 వేల మందికి పంపిణీ చేశారు. ప్రసాదం అయిపోయిందని పోలీసులు, ఆలయ పూజారులు మైకుల్లో చెప్పినా భక్తుల తాకిడి మాత్రం ఆగలేదు.
వచ్చే సంవత్సరం నుంచి 4 రోజుల పాటు : మొత్తం 1.50 లక్షల మందికిపైగా భక్తులు వచ్చారని పోలీసులు అంచనా వేశారు. అనుకున్న దాని కంటే బాగా ఎక్కువగా రావడంతో అసౌకర్యం కలిగిందని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. గరుడ ప్రసాద వితరణ శుక్రవారంతో పూర్తయిందని, వచ్చే సంవత్సరం నుంచి నాలుగు రోజుల పాటు ఇవ్వనున్నామని ఆయన వీడియో సందేశం ద్వారా వివరించారు.
తల్లికాని మహిళలకు గరుడ ప్రసాదం అంటూ ప్రచారం - చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన నగరవాసులు - Traffic in CHILKUR BALAJI TEMPLE