AP Cabinet Meeting Decisions : నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. వచ్చే కేబినెట్ లోగా దీనిపై కూలంకషంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జిల్లాల ఇంఛార్జి మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్రమంగా నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించిన వాటిపై పూర్తిస్థాయి విచారణ కోసం మంత్రుల కమిటీ కూడా వేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామవార్డు సచివాలయాల రేషనలైజేషన్ చేయాలని తీర్మానించింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యంగా నిషేధిత జాబితా నుంచి భూములకు అక్రమంగా తొలగించడంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను సీఎం నివేదిక కోరారు. భూ అక్రమాలపైనా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా విచారణ చేయించాలని కేబినెట్ భేటీలో తీర్మానించారు. ప్రత్యేకించి సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 13.6 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే ఇందులో నుంచి 7 లక్షల ఎకరాలకు పైగా భూముల్ని జాబితా నుంచి తప్పించినట్లు ప్రాథమికంగా నిర్థరించారు. వీటిలో 25 వేల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించారు.
అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు 2025 డిసెంబర్ 31 వరకూ పొడిగించేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. అందరికీ ఇళ్లు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు గానూ మార్గదర్శకాల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో 2019 అక్టోబర్ 15 వరకూ నిర్మించుకున్నఇళ్ల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు మంత్రి పార్థసారధి తెలిపారు.
నిషేధిత భూములపై మంత్రివర్గ ఉపసంఘం - కేబినెట్ నిర్ణయాలివే
'రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు 700 కోట్ల రుణ సేకరణకై ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మార్క్ ఫెడ్ తీసుకున్న 6 వేల కోట్ల రుణానికి అదనంగా ఈ హామీ ఇచ్చేందుకు కేబినెట్ తీర్మానించింది. ఏపీ ఫెర్రో అల్లాయ్స్ విద్యుత్ సుంకం టారిఫ్ తగ్గింపును కొనసాగించేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 300 కోట్ల రూపాయల భారం పడనుంది. అలాగే 62 నియోజక వర్గాల్లో 63 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ తీర్మానించింది. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ సొసైటీ ఏర్పాటు చేయాలని, తద్వారా నిర్వహణతో పాటు విరాళాల సేకరణకు ఆస్కారం ఏర్పడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది.' -కొలుసు పార్థసారథి సమాచార శాఖ మంత్రి
తోటపల్లి బ్యారేజ్‌లో కుడి ఎడమ వైపు మొత్తం 3 మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కుడివైపున రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. 294 కోట్ల రూపాయలతో తాడేపల్లి వైపు రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పచ్చజెండా ఊపింది.
ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కడప జిల్లా కొప్పర్తిలో 2,595 ఎకరాల, కర్నూలులో 2,621 ఎకరాల భూ బదలాయింపు కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియకు కేబినెట్ తీర్మానించింది. మూడు కేటగిరీలుగా గ్రామవార్డు సచివాలయాలు, ఉద్యోగులను విభజిస్తూ నిర్ణయించారు. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఆయా విభాగాల బాధ్యతలు అప్పగించాలని కేబినెట్ ఆమోదించింది.
ఆలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి - అధికారులకు సీఎం చంద్రబాబు సూచన