Man Sentenced to Life Imprisonment in Murder Case : ఇది సినిమా కథను పోలిన నేర గాథ. కష్టాల్లో ఉన్న వ్యక్తి సాయం కోసం బంధువుల వద్దకు వెళ్లగా, వారు ఆదరించకపోతే కక్ష పెంచుకోవడం, పగబట్టడం సినిమాల్లో చూస్తుంటాం. సినిమా కథ అయితే దానిని సుఖాంతంగా మలచవచ్చేమో కానీ, నిజజీవితంలో అలాంటి వైపరీత్యానికి పాల్పడిన వారికి ఊరట దుర్లభమని సుప్రీంకోర్టు తీర్పు చాటిచెప్పింది. చేసిన హత్యానేరానికి కటకటాల వెనక గడపాల్సిందేనని స్పష్టం చేసింది. బంధువును హత్యచేసి, ఆ తర్వాత పారిపోయేందుకు యత్నించిన నేరస్థుడికి కింది కోర్టు విధించిన శిక్షనే సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన చేపల శ్రీను (38) బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. కొన్నాళ్లకు తల్లి క్యాన్సర్‌తో కన్నుమూసింది. అనాథ అయిన శ్రీనును బంధువులెవరూ ఆదరించకపోవడంతో చిన్నాన్నలు, వారి పిల్లలపై కక్ష పెంచుకున్నాడు. దొంగతనాల్లాంటి నేరాలకు పాల్పడ్డాడు. రైళ్లలో టీ అమ్ముకొని జీవిస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై, వైద్యం కోసం అప్పుల పాలయ్యాడు. అదే సమయంలో తాడేపల్లిగూడెం, కొవ్వూరుల్లోని బంధువులను కలిసి ఆర్థిక సాయం చేయాలని వేడుకున్నాడు. ఒకరు రూ.2 వేలు, ఓ చిన్నాన్న రూ.500 ఇవ్వగా, ఆ డబ్బుతో తన కష్టాలు తీరవని భావించిన శ్రీను అయినవారిపై కక్ష పెంచుకున్నాడు. బంధువుల్లో డబ్బున్నవారినెవరినైనా చంపి నగలు, నగదు దోచేయాలని ప్రణాళిక రచించి, అమలు చేశాడు.
హత్య-ప్రమాదం-శిక్ష : 2012 డిసెంబరు 7న శ్రీను వరుసకు సోదరుడయ్యే ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. సినిమాల్లో మాదిరిగా వీపు వెనకాల చొక్కాలో సుత్తి దాచి పెట్టుకొని వెళ్లి వదిన వరసయ్యే మహిళను మంచినీళ్లడిగాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి గ్లాసులో నీళ్లు నింపుతుండగా, శ్రీను వెనుక నుంచి ఆమె తలపై సుత్తితో మోదాడు. కింద పడిపోయాక తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఆమె నగలతో ఉడాయించాడు. 10 రోజుల తర్వాత పోలీసులు రాజమహేంద్రవరంలో నిందితుడిని అరెస్ట్ చేసి, కొన్ని నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జైలుకు తరలించే క్రమంలో శ్రీను పారిపోయేందుకు భవనం పైనుంచి దూకబోయి కిందపడ్డాడు. దీంతో రెండు కాళ్లూ విరిగిపోయాయి. ప్రభుత్వమే అతనికి చికిత్స చేయించింది.
సాధారణ మరణమే అనుకున్నారు, కానీ అసలు విషయం తెలిసి షాక్!
శ్రీనుకు కొవ్వూరు 19వ అదనపు సెషన్స్ జడ్జి యావజ్జీవ శిక్ష విధిస్తూ 2015 సెప్టెంబరు 21న తీర్పు చెప్పారు. దాన్ని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు తీర్పునే ఖరారు చేస్తూ 2024 మార్చి 14న ఆదేశాలిచ్చింది. తాజాగా ప్రభుత్వం అందించే ఉచిత న్యాయసేవల విభాగం ద్వారా అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మహిళను హత్య చేసిన తీరు చాలా దారుణంగా ఉండటంతో న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకోవడానికేమీ లేదని నిర్ధారిస్తూ హంతకుడికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది.