Madhupada Road Accident Today : విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం మదుపాడ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో 2 గంటలపాటు పలువురు ప్రయాణికులు చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
క్రేన్ సాయంతో బస్సును బయటకు తీశారు. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతులు ఒడిశాకు చెందిన బాలుడు మోహిత్ రాయ్(3), సూరత్ రాయ్(35)గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా ఉచిత వైద్యశిబిరంలో పాల్గొనేందుకు ఒడిశాలోని మల్కాజిగిరి నుంచి విశాఖకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Kondapalli Srinivas on Madhupada Accident : ఈ ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. హైవేపై ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. క్షతగాత్రులు ఒడిశా వాసులు కావడంతో కుటుంబాలకు సమాచారం ఇవ్వాలని మంత్రి కొండపల్లి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.