Tips To Stop Phone Addiction in Children :ఈ రోజుల్లో చాలామంది నిద్ర లేవగానే పడుకునే ముందు స్మార్ట్‌ఫోన్ చూడటం వ్యసనంగా మారింది. మాట్లాడటానికి, డబ్బు లావాదేవీలకు, ప్రయాణాలకు, వినోదానికి, కాలక్షేపానికి ఇలా ప్రతిదానికి సెల్‌ఫోన్‌పై ఆధారపడి ఉంటున్నారు. వృద్ధుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు అందరి వేళ్లు ఫోన్‌పైనే ఉంటున్నాయి. ఈ పరికరం సాంకేతికతను దగ్గర చేస్తూనే సైబర్ నేరాలను పెంచేస్తోంది. ముఖ్యంగా చిన్నారులను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సర్వేలు సైతం ఇదే అంశాన్ని ఉటంకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ వ్యసనం నుంచి విముక్తి కలిగించే అంశాలపై తెలంగాణ మహిళా భద్రతా విభాగం అవగాహన కల్పిస్తోంది.
సైబర్ బానిసత్వం కారణంగా పిల్లలకు కలిగే అనర్థాలను బహిరంగపరచాలన్న ఉద్దేశంతో ఓ స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ ఇటీవల మెట్రో నగరాల్లో వెయ్యి మంది తల్లిదండ్రులను సర్వే చేసింది. ముఖ్యంగా సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సామాజిక అంతరాలు ఏర్పడటం, సరిగ్గా చదవకపోవడం లాంటి అనర్థాలు కలుగుతున్నట్లు గుర్తించింది.
- 5-16 ఏళ్ల వయసున్న వెయ్యి మంది పిల్లల్లో 60% మంది సైబర్ బానిస మనస్తత్వం అంటే ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్డడం, డిజిటల్ ఎడిక్షన్‌తో బాధపడుతున్నారు.
- ఆన్‌లైన్ కంటెంట్ వినియోగం నుంచి తమ పిల్లలను ఎలా మాన్పించాలనే అంశంలో 85% మంది తల్లిదండ్రులకు సరైన అవగాహన లేదు. ఈ విషయంలో వారంతా తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
- 70-80% మంది పిల్లల్లో స్క్రీన్ టైం చూడాల్సిన దానికంటే ఎక్కువగా చూస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటంతోపాటు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం వృథా చేస్తున్నారు
- స్మార్ట్‌ఫోన్లలో ‘పేరెంటల్ కంట్రోల్ ఫీచర్’ ద్వారా పిల్లల స్క్రీన్‌టైంను నియంత్రించే అవకాశమున్నా 10% మంది తల్లిదండ్రులే దీన్ని ఉపయోగిస్తున్నారు.
డిజిటల్ పరికరాలు, ఆన్‌లైన్ కార్యకలాపాల వినియోగం పెరగడాన్ని సైబర్ వ్యసనంగా అంటారు. దానికి ఇవే సంకేతాలు
- ఇది ఆన్‌లైన్ ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది
- జీవితంలోని పలు అంశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది
- ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత బాధ్యతలను విస్మరించడం
- స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లను దూరం చేస్తే చిరాకు పడటం, మొండిగా వ్యవహరించడం
- ఇంట్లో వారితో కంటే ఆన్‌లైన్ స్నేహితులతో మాట్లాడటానికి ప్రాధాన్యం ఇవ్వటం
- శారీరక ఆరోగ్యంపైనా దీని ప్రభావం
- బరువు పెరగడం
- శారీరక దృఢత్వాన్ని కోల్పోవడం
- నిశ్చల జీవనశైలికి అలవాటయ్యే ప్రమాదముంది.
ఆఫ్‌లైన్ కార్యకలాపాలకు ప్రోత్సాహం : పిల్లలు క్రీడలు, వ్యాయామ కార్యకలాపాల్లో పాల్గొనేలా చెయాలి. సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించాలి. చిత్రలేఖనం, పుస్తక పఠనం లాంటి ఆసక్తులను పెంపొందించేందుకు కృషి చేయాలి.