Winter Season Effects on Health and Precautions : చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో రోగనిరోధకశక్తి బలహీనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో వైరస్లు, బ్యాక్టీరియాలు వేగంగా శరీరంలోకి చేరుతాయి. శ్వాసనాళాలు బలహీనపడి దగ్గు, జలబు, జ్వరాలు ప్రబలుతాయి. న్యుమోనియా, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదముంది. కొన్నిరోజులుగా రాష్ట్రంలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య క్రమక్రమంగా పెరగుతోంది.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాంప్రసాద్ సూచించారు. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి వ్యాధులపై నిర్లక్ష్యంగా ఉంటే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, హృద్రోగ సమస్యలు, ఇతరత్రా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది హెచ్చరించారు. చల్లటి వాతావరణంలో కీళ్లనొప్పులు పెరుగుతాయని చెప్పారు. చలిలో వైరల్ ఫ్లూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చని తెలిపారు.
సరైన నిద్రతోపాటు నడక, వ్యాయామం ఎంతో మేలు : ఫ్లూ, న్యుమోనియా వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు అని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాంప్రసాద్ వివరించారు. రక్తప్రసరణ మందగించి గుండె జబ్బులు పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ సమయంలో వేడినీళ్లు తాగాలని, ఆవిరి పడుతూ శ్వాసనాళాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. పాలు, కూరగాయలు వంటి పోషకాలు, విటమిన్ సి ఉన్న పండ్లు తీసుకోవాలని పేర్కొన్నారు. వృద్ధులు ఎక్కువగా విశ్రాంతి, తగినంత నిద్రపోవాలని తెలిపారు. సరైన నిద్రతో పాటు తేలికపాటి నడక, వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.