CM Chandrababu Tour in Flooded Area in Vijayawada :ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దాదాపు నాలుగున్నర గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ ను పక్కన పెట్టి భవానీపురం నుండి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీపైనే సీఎం పర్యటన సాగింది.
ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి ఆవేదన, బాధను విని ధైర్యం చెప్పిన చంద్రబాబు ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తొలుత భవానీపురం వెళ్లిన చంద్రబాబు అక్కడ బాధితులతో మాట్లాడారు. తమకు సాయం చేరిందని ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో సాంత్వన చేకూరిందని ఆ ప్రాంత ప్రజలు చెప్పారు.
ఎవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas
సితార సెంటర్ నుంచి కార్లు వెళ్లలేని పరిస్థితుల్లో కాన్వాయ్ పక్కన పెట్టి జేసీబీ ఎక్కి ముందుకు కదిలారు. దారి పొడవునా బాధితులతో మాట్లాడారు. అదే జేసీబీపై జక్కంపూడి వెళ్లి అక్కడ బాధితులను కలిసి ప్రజలకు అందుతున్న వరద సాయంపై తెలుసుకున్నారు. అనంతరం వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, నున్న, కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్ కు వచ్చి అక్కడి నుంచి తన కాన్వాయ్ కారు ఎక్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయం లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల్లో బాధ్యత, భయం తీసుకురావాలనే కారణంతోనే తాను స్వయంగా మూడు రోజులుగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. అధికారులు బాధ్యత, మానవీయకోణంలో పని చేయాలని సూచించారు. సరిపడా ఆహార ప్యాకెట్లు పంపుతున్నా ఎందుకు చేరవేయడం లేదని అధికారులను ప్రశ్నించారు.