Chickens Cottages In Tirumala Row : టీటీ ప్రభాకర్‌బాబు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ప్రస్తుతం అదనపు ఎస్పీ హోదాలో పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 2019 ఆగస్టు 10 నుంచి 2020 నవంబరు 30 వరకు తిరుమల డీఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో సదరు అధికారి నిర్వాకంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శుక్రవారం అభియోగాలు మోపింది. ‘టీటీడీ కేటాయించిన వసతిగృహంలో నివసించిన ప్రభాకర్‌బాబు అందులో కోడిపుంజులను పెంచారు. ఆ వసతిగృహం భక్తులు, యాత్రికులకు కేటాయించిన కాటేజీల మధ్యలో ఉండటంతో రాత్రివేళ ఆ కోళ్ల అరుపుల శబ్దాలు, వాటి విసర్జితాల దుర్వాసనకు యాత్రికులకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.
ఆ కోళ్లకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం లాంటి పనులు కానిస్టేబుళ్లతో చేయించేవారు. ప్రభాకర్‌బాబు ప్రవర్తనతో విసిపోయి మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసు సిబ్బంది తాము అక్కడ పని చేయలేమని వేరే చోటకు పంపించాలని కోరగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు' అనేది అభియోగాల సారాంశం. ప్రభాకర్‌బాబుపై ఏడు అభియోగాలను నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం వాటన్నింటికీ 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా హాజరై సమాధానాలివ్వాలని ప్రభాకర్బాబును ఆదేశించింది. గడువు తేదీలోగా సమాధానాలివ్వకపోతే తమ వద్దనున్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.