ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడిపుంజులకు అందాల పోటీలు - ఎక్కడంటే ! - CHICKEN BEAUTY CONTESTS

కోడిపుంజుల అందాల పోటీల్లో బహుమతులు పొందిన ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి - బహుమతులు సాధించడం ఎంతో తృప్తినిచ్చిందని వెల్లడి

Chicken beauty contest
Chicken beauty contest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2025, 1:11 PM IST

CHICKEN BEAUTY CONTESTS : సంక్రాంతి వచ్చిందంటే కోడి పందేలు గుర్తుకొస్తాయి. కోళ్లకు ఎన్నో నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి, బరిలో దింపి, పౌరుషంతో పోరాటం చేయిస్తారు. దీని కోసం భారీగా ఖర్చు పెడతారు. అయితే కోడి అందాల పోటీలు నిర్వహిస్తారని మీకు తెలుసా? కోళ్లకు అందాల పోటీలా? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే మీరు వింటున్నది నిజమే. కోడి పుంజులు అంటే పౌరుషానికి ప్రతిరూపం. ఎంతో రాజసంగా ఉంటాయి. వీటి ముక్కు అంతకుమించి అబ్బుర పరుస్తుంది.

దక్షిణాది రాష్ట్రాల్లోనే కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. రక్తసిక్తమయ్యే బరుల్లో మాత్రమే కాకుండా, వీటిని అందాలు ఒలకబోసే వేదికలపై ప్రదర్శిస్తున్నారు. కోడిపుంజులు అంటే ఎంతో ఇష్టమైన ప్రకాశం జిల్లాకు చెందిన సయ్యద్‌ బాషా ఎన్నో బహుమతులు సైతం గెలుచుకున్నారు.

సయ్యద్‌ బాషా (ETV Bharat)

చిలక ముక్కు కోళ్లు:దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించే కోడిపుంజుల అందాల పోటీల్లో బహుమతులు పొంది తన ఆసక్తిని చాటుతున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలేనికి చెందిన సయ్యద్‌ బాషా. అరుదైన ‘చిలక ముక్కు’ జాతుల పెంపకంపై ఆయన గత కొన్ని సంవత్సరాలుగా దృష్టి పెట్టారు. చిలకను పోలిన ముక్కు, నెమలి మాదిరిగా ఉంటే తోక ఈ కోళ్ల జాతి ప్రత్యేకం. వివిధ రాష్ట్రాల్లో పోటీలకు ఈ కోళ్లను తీసుకెళ్లి పలు ట్రోఫీలు సాధించారు. పోటీలకు 3 నెలల ముందునుంచే వీటికి బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఖర్జూరం అందజేస్తారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సంజీవరెడ్డినగర్‌కు చెందిన మరో యువకుడు సైతం ఇలాంటి కోళ్లను పెంచుతున్నాడు.

పోటీలు ఎలా నిర్వహిస్తారంటే:ప్రతి సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరు చివరి వరకు కోళ్లకు ఈక రాలే సమయం. ఈ టైమ్​లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని సేలం, కృష్ణగిరి, కోయంబత్తూరు, దిండిగల్, ధర్మపురి, తిరుచ్చిలో, పాల్కడి, బెంగళూరు సమీప ప్రాంతాల్లో కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తారు. ముక్కు, మెడ, కళ్లు, కాళ్లు, ఠీవిగా నిలుచున్న తీరు, రంగు, ఈకలను నిశితంగా గమనించి కోళ్లకు మార్కులు వేస్తారు. ఎక్కువ మార్కులు పొందిన కోడి పుంజును విజేతగా ప్రకటిస్తారు. అదే విధంగా సంక్రాంతి వేడుకలకు సైతం దక్షిణాది రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో నిర్వహిస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిర్వహించే అందాల పోటీలకు కొమరోలు మండలానికి సయ్యద్‌ బాషా కోడి తన పుంజులను తీసుకెళుతున్నారు.

చిన్నప్పటి నుంచే కోళ్లు, పక్షుల పెంపకంపై ఆసక్తి ఉందని సయ్యద్‌ బాషా తెలిపారు. కోడిపుంజులను పోటీలకు తీసుకెళ్లి పలు బహుమతులు సాధించడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. అందులోనూ సేతువా, గాజు కక్కెర, డేగ, రసంగి తదితర రకాల కోడి పుంజులు ఎంతో అందంగా ఉంటాయని, వాటి తీరే బహుమతి తెచ్చిపడుతుందని అన్నారు.

మినీ స్టేడియాలను తలపిస్తున్న కోడిపందేల బరులు - వీఐపీల కోసం స్పెషల్ ఏర్పాట్లు

సంక్రాంతి బరిలోకి రాటుదేలుతున్న పందెం కో'ఢీ'

ABOUT THE AUTHOR

...view details