Chevireddy Bhaskar Reddy Warning: ‘మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడం, మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మేం రాజకీయ నాయకులం అని గుర్తు పెట్టుకోవాలి. మా మీద ఇష్టం వచ్చినట్లు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారు, మేం ప్రైవేటు కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త, కాబట్టి కాస్త చూసీచూడనట్లు వెళ్లండి’ అంటూ ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మహిళా రిటర్నింగ్ అధికారిని హెచ్చరించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకుంది.
వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక చంద్రశేఖర్‌పై మూడు నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 22వ తేదీన తాటిపర్తి చంద్రశేఖర్ భార్య తన భర్త తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు తమ కుమారుడితో కలిసి వెళ్లారు. కుమారుడు మైనర్ కావటంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రిటర్నింగ్ అధికారిణి శ్రీలేఖతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అయితే తాము నిబంధనల మేరకే పని చేస్తున్నామని, నియమావళిని ఉల్లంఘిస్తేనే కేసులు నమోదు చేశామని చెవిరెడ్డికి ఆర్వో బదులిచ్చారు.
అయినా యంత్రాంగం తీరుపై చెవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముందుగా ఆర్వో కేంద్రంలోకి సైతం చెవిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించారు. ఆర్వో ఆఫీస్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరూ రిజిస్టర్‌లో సంతకం చేయాలి. సెల్‌ఫోన్లు వెంట తీసుకెళ్లకూడదు. ఈ రెండు నిబంధనలనూ చెవిరెడ్డి అతిక్రమించారు. ప్రతి నామినేషన్‌ను ఆర్వో కార్యాలయంలో వీడియో చిత్రీకరించాలి. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పటంతో ఆ సమయంలో వీడియో చిత్రీకరణ సైతం నిలిపివేసినట్లు తెలిసింది. మహిళా ఆర్వో పట్ల చెవిరెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.