తెలంగాణ

telangana

ETV Bharat / state

విమానాశ్రయాన్ని తలపించే రీతిలో చర్లపల్లి రైల్వే టర్మినల్ - త్వరలో పూర్తికానున్న నిర్మాణం - Cherlapalli Terminal Railway - CHERLAPALLI TERMINAL RAILWAY

Cherlapally Terminal Railway : చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్టేషన్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మాణం చేపట్టగా చర్లపల్లి టర్మినల్ అందమైన ముఖద్వారంతో ఆకట్టుకుంటుంది. ఎత్తైన ప్రదేశంలో స్టేషన్ నిర్మాణం చేపట్టడంతో స్టేషన్‌కు దిగువన ప్లాట్ ఫాంలకు నిర్మాణం చేపట్టారు.

Cherlapally Terminal Railway Works
Cherlapally Terminal Railway Works (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 4:47 PM IST

Cherlapally Terminal Railway Works :చర్లపల్లి రైల్వేస్టేషన్ ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. విమానాశ్రయాన్ని తలపించేలా నిర్మించిన ఈ స్టేషన్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదే జరిగితే ప్రస్తుతం నగరంలో ఉన్న నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ భారం తగ్గుతుంది. హైదరాబాద్‌కు తూర్పు భాగంలో చర్లపల్లి టర్మినల్ ఉంది. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్ కూడా ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టర్మినల్‌కు చేరుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది. చర్లపల్లి టర్మినల్ నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించారు. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టర్మినల్ అందుబాటులోకి రాబోతుంది.

ప్రయాణికుల భద్రతకు పెద్ద పీటవేస్తూ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నార్త్ లాలాగూడ, చర్లపల్లి, మౌలాలి, ఘట్‌కేసర్ ప్రాంతాల నుంచి 500ల చెట్లను తీసుకువచ్చి ట్రాన్స్ లొకేషన్ ప్రక్రియ ద్వారా నాటారు. కోచ్ క్లీనింగ్‌తో పాటు కోచ్ వాషింగ్ చేసిన నీటిని తిరిగి పునర్వినియోగం చేసేవిధంగా ఏర్పాట్లు చేశారు. భూగర్భజలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఉన్న 3 ప్రధాన రైల్వే స్టేషన్లు స్వాతంత్ర్యానికి పూర్వమే నిర్మించారు. ఇవి ప్రస్తుతం పెరిగిన జనాభాకు సరిపోవడం లేదు. కానీ, చర్లపల్లి టర్మినల్‌ను విశాలంగా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా నిర్మించారు.

ఐదు ప్లాట్ ఫాంలకు అదనంగా మరో నాలుగు : ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. దీంతో స్థానికంగా నడిచే ఎంఎంటీఎస్​ రైళ్లను చర్లపల్లి టర్మినల్‌కు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రైల్వే స్టేషన్‌ను చేరుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్ ఫాంలకు అదనంగా మరో 4 ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పార్సిల్‌ కేంద్రాలను నిర్మించారు. అలాగే ఆర్పీఎఫ్​ సిబ్బంది కోసం ప్రత్యేక నిర్మాణాలను చేపట్టారు. పాదాచారుల వంతెలు, వాహనాల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

శరవేగంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ పనులు - 4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి

ABOUT THE AUTHOR

...view details