Fish Prasadam Distribution Dates 2024 :మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని కుటుంబ సభ్యులు సన్నద్ధం అవుతున్నారు. వచ్చే నెల 8 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దీనిని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
Chepa Mandu 2024 Dates :ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. జూన్ 8న మృగశిర ఉదయం పదకొండు గంటలకు ప్రవేశిస్తుందని అప్పటి నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ప్రసాదాన్ని అందిచనున్నట్లు చెప్పారు. పూజాకార్యక్రమాల అనంతరం జూన్ 7న దూద్బౌలిలో దీనిని తయారీ చేస్తామని బత్తిని అమర్నాథ్ గౌడ్ వివరించారు. భక్తులకు పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.
ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని అందిస్తున్నామని బత్తిని అమర్నాథ్ గౌడ్ చెప్పారు. ఇందుకోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో, వైద్య సహాయం, భోజన సౌకర్యం, త్రాగు నీరు వంటి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసిన విధంగానే, ఈ సర్కార్ సైతం తగిన సౌకర్యాలు కల్పించామని కోరుతున్నామని బత్తిని అమర్నాథ్ గౌడ్ అన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్లో రోగులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లు సేవలు అందిస్తారని బత్తిని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.