Healthy Food Habits In Dussehra Season :చెడుపై విజయం సాధించడమే ‘దశ’హరా(దసరా) పండుగ. కాలక్రమేణా వ్యవహారంలో దసరాగా స్థిరపడింది. మహాభారత, రామాయణ, ఇతిహాసాల్లోనూ ఈ పండుగకు సంబంధం కనిపిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి రాక్షస సంహారం చేసి రావణుడిపై విజయం సాధించిన దినంగా రామాయణంలో ప్రస్తావించారు. పంచ పాండవులు ధర్మానికి కట్టుబడి అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని కౌరవ సంహారానికి ఉద్యుక్తులవుతూ విజయ సాధన కోసం జమ్మి చెట్టు మీద దాచిన తమ ఆయుధాల్ని కిందికి దించిన దినంగా విజయదశమిని భావిస్తారని మహాభారతంలో ఇందుకు సంబంధించిన ప్రస్తావన ఉంది.
శరదృతువులో తేలికైనట్లు సమస్యా మేఘావృతమైన మనసు గణపతి ఆరాధనతో ఆపదల్ని తొలగించుకుని శరత్కాల మేఘంలాగా స్వచ్ఛమైన, తేలికైన మనసుతో జగన్మాత ఆరాధనకు సన్నద్ధమవుతున్నవేళ ఇది. ఈ శుభ తరుణంలో అమ్మవారి వైభవాన్ని కీర్తించుకునేందుకు వీలుగా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తాం. నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు మాత్రమే కాదు తొమ్మిది పగళ్లు. అని కూడా అర్థం. తొమ్మిది రాత్రుల తర్వాత వచ్చే పగలే విజయదశమిగా భావిస్తారు.
అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజున దశ దుర్గుణాలు సంహరించినందుకు ఈ పేరు వచ్చింది. బద్దకం, అతిగా తినడం, కాలు కదపకపోవడం, ‘మత్తు’కు బానిస అవ్వడం, సోషల్ మీడియాలో గంటల తరబడి గడపటం వంటి దుర్గుణాలను అంతమొందించుకోవడానికి ఓ లక్ష్యాన్ని పెట్టుకుందాం. దసరా నుంచే తొలి అడుగు వేద్దాం.
డ్రైఫ్రూట్స్ ఎంతో మధురం :ఎండు ఫలాలు(డ్రైఫ్రూట్స్) తినేవారి సంఖ్య పెరగడంతో ఇటీవల పెద్ద దుకాణాలు వెలుస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రకరకాల డ్రైఫ్రూట్స్ తెప్పిస్తున్నారు. జీడిపప్పును గోవా నుంచి, ఆల్‌మండ్స్ (బాదం), పిస్తా కాలిఫోర్నియా, ఎండు ద్రాక్ష, అంజీరాను ఆఫ్ఘనిస్తాన్, ఖర్జూరాలో అజ్వ రకం, మెడ్జల్ రకాలను సౌదీ అరేబియాలోని మదీనా నుంచి తెప్పించి ఇక్కడి షాపుల్లో విక్రయిస్తున్నారు. ఆల్‌మండ్స్, మమ్రా ఇరాన్ నుంచి, ఆఫ్రికాట్ బోల్ట్ (ఖుబానీ) టర్కీ, వాల్‌నట్స్ కశ్మీర్ నుంచి, పొమేలా (ఎండిన నారింజ పండు) ఏషియన్ ఫ్రూట్స్‌ను మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక దేశాల నుంచి, బ్లూ బెర్రీస్ యూరప్ నుంచి, గోల్డెన్ కివీ డ్రైడ్, గువా డ్రైడ్ (ఎండిన జామ) మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, కుంకుమ పువ్వు, జాపత్రి కశ్మీర్ లాంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు.
ఆరోగ్య సిరి సంపదలు :మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి అవసరమైన పీచు పదార్థం (ప్రతి ఒక్కరికీ రోజుకు 38 గ్రాములు ఫైబర్ అవసరం) ఇది ఎక్కువగా సిరి ధాన్యాల నుంచే లభిస్తుంది. ఓ 10 గ్రాములు కూరగాయలు, ఆకుకూరల నుంచి లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో(ప్రపంచ ఆరోగ్య సంస్థ), ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) లెక్కల ప్రకారం ఒక వ్యక్తికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు రోజుకు 400 గ్రాములు, బియ్యం 190 గ్రాములు, పప్పు ధాన్యాలు 40 గ్రాములు అవసరమవుతాయి. 5 వ్యక్తులున్న కుటుంబానికి 200 గ్రాముల పప్పుధాన్యాలు, రెండు పూటలకు కిలో బియ్యం, అర కిలో పండ్లు, కిలోన్నర కూరగాయలు, ఆకుకూరలు కావాలి.