Chandrababu On Ramoji Rao Demise :రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.
Nara Lokesh Condolences: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు అందరికీ మార్గదర్శి అని వ్యాఖ్యానించిన లోకేశ్ ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారని తెలిపారు.
MP Rammohan Naidu Condolences:రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి తెలియజేశారు. ప్రతి తెలుగింటితో రామోజీరావుకి అనుబంధం విడదీయలేనిదని కోనియాడారు. ప్రతి తెలుగు గడప ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.