Chandrababu Comments on CM Jagan:బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో తెలుగుదేశం నిర్వహించిన 'రా కదలిరా' సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జిల్లాతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ సభకు తెలుగుదేశం శ్రేణులు, జనసైనికులు భారీగా తరలివచ్చారు. విభజన హామీల కోసమే, తాను నాడు బీజేపీతో విభేదించానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ మాత్రం రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
ఆమంచి ఇంటికి, కథ కంచికి: వైఎస్సార్సీపీ నేతలు పర్చూరులో భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గంలో 14 వేల ఫామ్-7 దరఖాస్తులు పెట్టారని, దొంగఓట్లు నమోదు చేసి గెలుద్దాం అనుకున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హీరోలా పోరాడారని కితాబిచ్చారు. ఏలూరి సాంబశివరావు వల్ల ఆమంచి ఇంటికి, కథ కంచికి అని ఎద్దేవా చేశారు. బాపట్ల ఎంపీతో పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరాచకాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఫ్యాను మూడు రెక్కలని , మూడు ప్రాంతాల ప్రజలు విరగొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 52 రోజుల పాటు విరామం లేకుండా పనిచేసి రావణాసురుడి వధ చేయాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు రాని ప్రభుత్వం, పార్టీ కార్యాలయాలకు మాత్రం!
టీడీపీ-జనసేన ప్రభుత్వానికే సాధ్యం: నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని, మద్యపాన నిషేధంపై జగన్ ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వారంలోగా సీపీఎస్ రద్దు అన్నారు, ఆ బటన్ ఎందుకు నొక్కలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పడిపోయిందని ఏటా రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గిందని చంద్రబాబు ఆరోపించారు. చెరకు తోటలు కాల్చడం తప్ప బాపట్ల ఎంపీకి ఏం తెలుసని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతును రాజు చేయటం, టీడీపీ-జనసేన ప్రభుత్వానికే సాధ్యమని తెలిపారు.